చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి, 200 మందికి గాయాలు
చైనా జాతీయ కమిషన్, అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ సహాయక చర్యలకు ఉపక్రమించింది. సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో సుమారు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 200మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ భూకంప తీవ్రత.. రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదు అయ్యింది. భూకంపం 35 కి.మీ (21.75 మైళ్లు) లోతులో ఉందని, దాని కేంద్రం లాన్‌జౌ, చైనాకు పశ్చిమ-నైరుతి దిశలో 102 కి.మీ దూరంలో ఉన్నట్లు EMSC తెలిపింది.
చైనా జాతీయ కమిషన్, అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ సహాయక చర్యలకు ఉపక్రమించింది. సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. సోమవారం (డిసెంబర్ 18) అర్ధరాత్రి దాటాక ఈ భారీ భూకంపం సంభవించింది. చైనాలోని రెండు ప్రావిన్స్‌లలో భూకంపం వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థ గ్జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. గన్సు ప్రావిన్స్‌లో 100 మంది, పొరుగున ఉన్న కింగ్‌హై ప్రావిన్స్‌లో మరో 11 మంది మరణించినట్లు సమాచారం. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. భూకంపం ధాటికి భయభ్రాంతులకు గురైన ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.
ఈ ఏడాది ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. డజన్ల కొద్దీ భవనాలు కూలిపోయాయి. ఇక సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 100 మంది మరణించారు. 2008లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంప ధాటికి సుమారు 5వేలమంది పాఠశాల విద్యార్థులతో సహా 87,000 మందికి పైగా మరణించారు.