మోడీతో హక్కుల ఉల్లంఘనపై చర్చించండి.. బైడెన్‌కు యూఎస్ ప్రజాప్రతినిధుల లేఖ
అమెరికా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. ఇండియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించాలని జో బైడెన్‌ను ఆ దేశ చట్ట సభ్యులు కోరారు.
అమెరికాలో మూడు రోజుల పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. నరేంద్ర మోడీకి న్యూయార్క్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం నుంచి అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. రక్షణ రంగానికి సంబంధించిన సహకారం, ఉన్నత సాంకేతికతను పరస్పరం పంచుకునే విషయంలో బైడెన్, మోడీ కీలక చర్చలు జరుపుతారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు ఈ భేటీ కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.
కాగా, అమెరికా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. ఇండియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించాలని జో బైడెన్‌ను ఆ దేశ చట్ట సభ్యులు కోరారు. ఈ మేరకు సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్, కాంగ్రెస్ సభ్యుడు ప్రమీలా జయపాల్‌తో సహా 60 మంది సభ్యులు బైడెన్‌కు లేఖ రాశారు. ఇండియా-యూఎస్ సంబంధాలు మెరుగుపడటానికి తాము సుదీర్ఘకాలంగా మద్దతు ఇస్తున్నాము. కానీ మన స్నేహితుడు (ఇండియా)తో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. వాటిపై నిజాయితీగా చర్చించాల్సిన అవసరం ఉందని వారు లేఖలో పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరుగనున్న భేటీలో.. అనేక రంగాలకు సంబంధించిన కీలక చర్చలు జరుగనున్నాయి. అదే సమయంలో ఇండియాలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘన విషయాలను కూడా తప్పకుండా లేవనెత్తాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మానవహక్కులు, మీడియా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, వలసదారుల హక్కుల పరిరక్షణ పాలసీలను రూపొందించి ఎంతో గౌరవించారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా గౌరవం పెరిగిందని బైడెన్‌ను ప్రశంసించారు. అదే సమయంలో మన స్నేహితుడైన నరేంద్ర మోడీ అమెరికా వస్తుండటంతో ఈ లేఖ రాస్తున్నాము.
ఇటీవల కాలంలో ఇండియాలో రాజకీయ అసమానతలు, మత విద్వేషాలు పెరుగుతున్నాయి. అనేక ప్రజా సంఘాలు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛ, ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ విషయాలన్నీ కొన్ని నివేదికల ద్వారా మేము తెలుసుకున్నారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ విషయంలో ఇండియాలో ఆందోళన నెలకొన్నది. పరమత అసహనం.. ముఖ్యంగా మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయి. దీనిపై తప్పకుండా చర్చించాలని కోరారు.