అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు
భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. ఆయన్ని వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రంప్‌కి చెవి వద్ద గాయమైనట్టు తెలిసింది. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. కాల్పులు మొదలైన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు దుండగుడిని హతమార్చాయి.
పెన్సిల్వేనియాలో ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారం చేస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. 13వ తేదీ సాయంత్రం 6.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ట్రంప్ స్టేజీపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. ఆయన్ని వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. అమెరికాలో ఈ రకమైన హింసకు చోటు లేదని ఆయన తెలిపారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని విన్నందుకు తాను కృతజ్ఞుడని అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను ట్రంప్ కోసం, అతని కుటుంబం కోసం, ర్యాలీలో ఉన్న వారందరి కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇక ఈ ఘటనపై ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందిస్తూ ట్రంప్‌ను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు.