Telugu Global
International

నేను గెలిస్తే.. ఎలాన్‌ మస్క్‌కి కేబినెట్‌లో చోటు

ఎలాన్‌ మస్క్‌ కూడా ట్రంప్‌ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్‌ వేదికగా ఆయన వెల్లడించారు.

నేను గెలిస్తే.. ఎలాన్‌ మస్క్‌కి కేబినెట్‌లో చోటు
X

అమెరికా అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్‌కి తన కేబినెట్‌లో చోటిస్తానని ప్రకటించారు. అలా కాని పక్షంలో సలహాదారుడిగానైనా మస్క్‌ని నియమించుకుంటానని తెలిపారు. ఎలాన్‌ మస్క్‌ కూడా ట్రంప్‌ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్‌ వేదికగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా మస్క్‌ గురించి ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. అతను తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. విద్యుత్‌ వాహనాలపై ఇస్తున్న 7,500 డాలర్ల ట్యాక్స్‌ క్రెడిట్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. ట్యాక్స్‌ క్రెడిట్లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు కావని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్‌ తాజాగా వెల్లడించారు. అధిక ధరల వల్ల ఎల‌క్ట్రిక్ కార్లకు అంతగా గిరాకీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తాను పెట్రోల్‌ కార్ల తయారీ వైపు సానుకూలంగా ఉన్నట్టు వెల్లడించారు.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మస్క్‌ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ఇటీవల వీరిద్దరి మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ మధ్యే వీరిద్దరూ ఎక్స్ ఇంట‌ర్వ్యూ తరహాలో వివిధ అంశాలపై చర్చించుకున్న విషయం తెలిసిందే. మస్క్‌కు కీలక పదవి ఇస్తానని ట్రంప్‌ అనడం ఇది తొలిసారేం కాదు. 2016లో గెలిచిన సమయంలో రెండు కీలక సలహా మండళ్లకు మస్క్‌ను ఎంపిక చేశారు. కానీ, పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2017లోనే ఆయన రాజీనామా చేశారు.

First Published:  20 Aug 2024 1:15 PM IST
Next Story