వారిని విడిచిపెట్టకపోతే నరకం చూపిస్తా
హమాస్‌కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. తమ చెరలోని బందీలకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మిలిటెంట్ సంస్థపై విరుచుకుపడ్డారు. తాను అధికార బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు.
నేను అమెరికా అధ్యక్షుడిగా 2024 జనవరి 20న బాధ్యతలు చేపడుతాను. ఈలోపు బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తాను. చరిత్రలో చూడని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే బందీలను విడుదల చేయండి అని హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచడానికి హమాస్ మిలటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అమెరికా-ఇజ్రాయెల్ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడారు. నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నాను. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి అంటూ అలెగ్జాండర్లో అందులో అభ్యర్థించారు. ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించింది. ఎడాన్‌తో సహా బందీలందరి విడుదలకు ప్రధాని నెతన్యాహూ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్ వేదికగా హమాస్‌ను హెచ్చరించారు.