Telugu Global
International

ట్రంప్‌కు బిగ్‌షాక్‌.. పోర్న్‌స్టార్ కేసులో దోషిగా నిర్ధారణ

ఈ కేసులో శిక్షకు సంబంధించి జులై 11న కీలక తీర్పు వెల్లడించనుంది న్యూయార్క్ కోర్టు. ఐతే ఈ తీర్పున‌కు కొన్ని రోజుల ముందే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది.

ట్రంప్‌కు బిగ్‌షాక్‌.. పోర్న్‌స్టార్ కేసులో దోషిగా నిర్ధారణ
X

మరో 5 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌షాక్ తగిలింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై లైంగిక ఆరోపణలు చేయకుండా ట్రంప్‌ డబ్బు ఇచ్చారంటూ పోర్న్‌ స్టార్ స్టార్మీ డేనియల్స్ చేసిన ఆరోపణల కేసులో (హష్‌ మనీ కేసు) ట్రంప్‌ దోషిగా తేలారు. ఈ మేరకు.. ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని న్యూయార్క్​ జ్యూరీ స్పష్టం చేసింది.

మరో 5 నెలల్లో జరిగే ఎన్నికల్లో గెలిచి.. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలని భావిస్తున్న ట్రంప్‌కు.. తాజా తీర్పు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐతే అమెరికన్ చట్టాల ప్రకారం దోషిగా తేలినప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయవ‌చ్చు. పోర్న్​ స్టార్​ కేసులో ఆయనకు జైలు శిక్ష పడినా.. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగొచ్చు.

ఈ కేసులో శిక్షకు సంబంధించి జులై 11న కీలక తీర్పు వెల్లడించనుంది న్యూయార్క్ కోర్టు. ఐతే ఈ తీర్పున‌కు కొన్ని రోజుల ముందే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. ఈ సమావేశంలోనే రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లిక్ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్ - ట్రంప్‌ కేసు ఏంటి?

డొనాల్డ్​ ట్రంప్​ 2006లో తనతో సెక్స్‌లో పాల్గొన్నట్టు పోర్న్​ స్టార్​ స్టార్మీ డేనియల్స్​ చెప్పారు. అయితే.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇది తనకు మైనస్​ అవుతుందని భావించిన డొనాల్డ్​ ట్రంప్​.. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు స్టార్మీ డేనియల్స్‌కు 1,30,000 డాలర్లు ఇచ్చినట్టు, సంబంధిత రికార్డులను ధ్వంసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

First Published:  31 May 2024 7:59 AM IST
Next Story