229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్య
ఆఫ్రికా దేశమైన ఇథియోపియా లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి 229కి చేరింది.
ఆఫ్రికా దేశమైన ఇథియోపియా లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి 229కి చేరింది. విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంచో షాఖా గోజ్డి జిల్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అయితే రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో ఉండగానే మరోమారు కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో బురద ముంచెత్తి మృతుల సంఖ్య పెరిగింది. ఐదుగురిని మాత్రం రెస్క్యూ టీమ్స్ ప్రాణాలతో రక్షించాయి.
ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య సోమవారం 55గా ఉండగా మంగళవారానికి ఏకంగా 157కు చేరుకుంది. ఇక బుధవారం ఆ సంఖ్య 229కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఘటనా స్థలంలో బురదలో కూరుకుపోయి, ఊపిరాడక చనిపోయిన తమ ఆప్తుల మృతదేహాలను చూసుకుని బాధిత కుటుంబీకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, మృతదేహాలను ఇప్పటికీ బయటకు తీస్తున్నామని, ఇవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియదని, గోఫా ప్రాంత జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ అధిపతి మార్కోస్ మెలేస్ మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఈ ప్రమాద ఘటన మా దేశానికి పెను విషాదాన్ని మిగిల్చింది. దీనివల్ల మాకు భయంకరమైన నష్టం కలిగింది" అని పేర్కొన్నారు. ఇథియోపియా పార్లమెంట్ సభ్యులు కెమల్ హషి మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం అందిస్తున్నామన్నారు.