బంగ్లాలో కొనసాగుతున్న విధ్వంసం.. 440 దాటిన మృతుల సంఖ్య
హసీనా దేశాన్ని వీడిన తర్వాత జరిగిన దమనకాండలో మొత్తంగా 100 మందికి పైగా మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయినా, అక్కడ చెలరేగిన విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. షేక్ హసీనా ప్రధానిగా తప్పుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తగా.. సోమవారం సాయంత్రానికే ఆమె రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిపోయారు. అయినా అల్లరి మూకలు ఆ రాత్రంతా దేశవ్యాప్తంగా యథేచ్ఛగా విధ్వంసం కొనసాగించాయి.
ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. చివరికి పోలీస్‌స్టేషన్లను కూడా వదల్లేదు. ఒకచోట ఎస్సైని కొట్టి చంపారు. మరోచోట ప్రముఖ సినీ హీరో ఇంటిపై దాడికి దిగగా, హీరో, ఆయన తండ్రి తుపాకీతో బెదిరించారు. దీంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయి.. ఇద్దరినీ కర్రలతో కొట్టి చంపేశారు. జోషోర్ జిల్లాలో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నాయకుడి హోటల్‌ని తగలబెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు. సోమవారం ఢాకాలో పాక్షికంగా ధ్వంసం చేసిన హసీనా తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారు.
బంగ్లాలో అల్లర్లకు పాల్పడేవారిలోని మైనారిటీలు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను లక్ష్యం చేసుకున్నారు. దేవాలయాల ధ్వంసం చేశారు.. మహిళలపై అకృత్యాలకు తెగబడ్డారు.. హసీనా దేశాన్ని వీడిన తర్వాత జరిగిన దమనకాండలో మొత్తంగా 100 మందికి పైగా మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది. సైన్యం రంగంలోకి దిగడంతో మంగళవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్టు చెబుతున్నారు.
యూనుస్ సారథిగా తాత్కాలిక ప్రభుత్వం..
నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథిగా సైన్యం కనుసన్నల్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్ష కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కేసులు, తాత్కాలిక జైలుశిక్ష నేపథ్యంలో యూనుస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. హసీనా సర్కారు పతనాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిణామాన్ని దేశానికి రెండో విముక్తిగా అభివర్ణించారు. అంతకుముందు, విద్యార్థి సంఘాల అల్టిమేటం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మొహమ్మద్ బుద్దీన్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో అధ్యక్షుడు భేటీ అయ్యారు. తాత్కాలిక సర్కారు కూర్పుపై వారితో చర్చించారు. విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎస్పీ) సారథి బేగం ఖలీదా జియా (79)ను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు.