విజృంభిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్.. - ప్రపంచ దేశాల్లో టెన్షన్ టెన్షన్
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. గడచిన వారం రోజుల్లో 35 లక్షల కోవిడ్ కేసులు నమోదైనట్టు సమాచారం. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. పేషెంట్లు లక్షలాది మంది ఉండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచమంతటా అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం చైనాను పూర్తిగా చుట్టేస్తోంది. అక్కడ నిత్యం భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. చైనా ప్రభుత్వం అధికారికంగా మరణాలను నమోదు చేయకపోయినా.. అక్కడి శ్మశానాలకు జనం తాకిడి భారీగా ఉన్నట్టు సమాచారం. ఆస్పత్రులకు కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నట్టు తెలిస్తోంది. పలు ఆస్పత్రులు శవాల గుట్టలతో నిండిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి.
గత వారం రోజుల్లో 35 లక్షల కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. గడచిన వారం రోజుల్లో 35 లక్షల కోవిడ్ కేసులు నమోదైనట్టు సమాచారం. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. పేషెంట్లు లక్షలాది మంది ఉండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల బయట వ్యాక్సిన్లు, మెడిసిన్ల కోసం పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. చైనాలో ఒక్క మాటలో చెప్పాలంటే పరిస్థితి చేయి దాటిపోయిందనే చెప్పాలి. అక్కడి పలు నగరాల్లో టెంపరరీ ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేశారు. అయినా రోగులకు బెడ్లు సరిపోని పరిస్థితి అక్కడ నెలకొంది. గత వారం రోజుల్లో ఆ దేశంలో లక్షా 48 వేల కొత్త కేసులు నమోదైనట్టు తెలిసింది. అక్కడి మార్చురీల్లో పెద్ద సంఖ్యలో మృతదేహాలు పోగు పడినట్టు సమాచారం.
వేగంగా విస్తరిస్తున్న బీఏ-5.2, బీఎఫ్-7 వేరియంట్లు...
ప్రస్తుతం బీఏ-5.2, బీఎఫ్-7 సబ్ వేరియంట్లు ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవి ఒమిక్రాన్‌లో సబ్ వేరియంట్లు. రానున్న 90 రోజుల్లో చైనాలో 60 శాతం మంది జనాభాకు కరోనా సోకే ప్రమాదముందని అమెరికా అంటు వ్యాధుల నిపుణులు ఎవిక్ ఫైవల్ డింగ్ అంచనా వేస్తున్నారు. ఈ జనవరి నుంచి రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశముందని, ఆ దేశంలో దాదాపు 20 లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 10 శాతం మంది ప్రజలకు కోవిడ్ సోకే అవకాశముందని భావిస్తున్నారు. చైనాతో పాటు జపాన్, బ్రెజిల్, దక్షిణ కొరియా, అమెరికా దేశాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. గతంలో కేసులు రెట్టింపు అయ్యేందుకు కొన్ని రోజులు పట్టేది. కానీ ఇప్పుడు కొన్ని గంటల్లోనే కేసులు డబుల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే కోవిడ్ ఫోర్త్ వేవ్ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం...
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్రం హెచ్చరికలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క ఏపీ సర్కార్ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అనుమానితుల శాంపిల్స్‌ను పంపుతోంది. కోవిడ్ ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తోంది. బుధవారం ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సీనియర్ అధికారులు, వైద్య నిపుణులు ఈ సమీక్షకు హాజరుకానున్నారు. భారత్‌కు పొంచివున్న ముప్పు, తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.