Telugu Global
International

ఆ తప్పు చేస్తే 39 నిమిషాల్లో మీ పాస్‌వర్డ్ బ్రేక్ చేస్తారు జాగ్రత్త..

ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది password అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. 'బిగ్ బాస్కెట్' అనే పదాన్ని 75 వేల మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడం మరో విశేషం.

ఆ తప్పు చేస్తే 39 నిమిషాల్లో మీ పాస్‌వర్డ్ బ్రేక్ చేస్తారు జాగ్రత్త..
X

పాస్‌వర్డ్‌.. గతంలో ఒకటీ రెండు ఉండేవి, ఇప్పుడు ఒక్కొకరికి పదుల కొద్దీ పాస్ వర్డ్ లు అవసరం. మెయిల్ అయినా, బ్యాంక్ లాగిన అయినా, యాప్స్ అయినా.. ఇతరత్రా దేనికయినా పాస్ వర్డ్ తప్పనిసరి. అన్ని గుర్తు పెట్టుకోవడం కష్టమనుకునేవారు అన్నిటికీ ఒకటే పాస్ వర్డ్ పెట్టుకుంటారు. అది కూడా ఎప్పుడూ తమకి గుర్తుండేలా ఉండాలనుకుంటారు. అక్కడే చాలామంది తప్పు చేస్తున్నారని అంటున్నారు టెక్ నిపుణులు. ఎందుకంటే మనం సాధారణంగా పెట్టే పాస్ వర్డ్ లు హ్యాకర్లు తలచుకుంటే 39 నిమిషాల్లో బ్రేక్ చేస్తారట. ఒక సాధారణ పాస్ వర్డ్ ని బ్రేక్ చేయడానికి ఆ సమయం సరిపోతుంది. ఒక కష్టమైన పాస్ వర్డ్ పెట్టుకుంటే.. అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, న్యూమరికల్స్, స్పెషల్ క్యారెక్టర్లతో కలిపి 18 అక్షరాల పాస్ వర్డ్ పెడితే 438 ట్రిలియన్ సంవత్సరాల వరకు దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరట.

పాస్ వర్డ్ లపై ఆసక్తికర సర్వే..

బలహీనమైన పాస్ వర్డ్ లు పెట్టుకుంటే హ్యాకర్లు సులభంగా చేధించగలరు. నార్డ్ పాస్ అనే సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి సాధారణ పాస్ వర్డ్‌ల‌ వివరాలను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 3.5 లక్షల మంది password అనే పదాన్ని పాస్ వర్డ్ గా ఉపయోగిస్తున్నారట. 'బిగ్ బాస్కెట్' అనే పదాన్ని 75వేల మంది పాస్ వర్డ్ గా పెట్టుకోవడం మరో విశేషం. 123456, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummy, guest, vip12345 అనేవి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగించే టాప్-10 పాస్ వర్డ్స్.

ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో నార్డ్ పాస్ సర్వే నిర్వహించింది. బాగా ప్రచారంలో ఉన్న పేర్లను పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటే హ్యాకర్ల పని సులభం అవుతుందని నార్డ్ పాస్ సంస్థ చెబుతోంది. మనం తప్పు చేసి ఎదుటివారిని నిందించే కంటే.. మన పాస్ వర్డ్ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరూ కనిపెట్టలేని విధంగా పెట్టుకోవాలి. రాబోయే కాలంలో ఇది మరింత అవసరం. అందుకే పాస్ వర్డ్స్ విషయంలో గోప్యత ఎంత అవసరమో, ఎవరికీ తెలియని విధంగా వాటిని పెట్టుకోవడం కూడా అంతే అవసరం.

First Published:  16 Nov 2022 12:14 PM GMT
Next Story