ఎన్నికలపై వ్యాఖ్యలు.. కేంద్రానికి 'మెటా' క్షమాపణలు
అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నామన్న మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్
ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది. ఎన్నికల ఫలితాలపై తాము చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నట్లు చెప్పింది. భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై మెటా అధినేత జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత్ సహా అనేక దేశాల్లో ప్రజలు తమ ఓటుతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఓడించారని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.
జుకర్‌బర్గ్ వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన పోస్ట్‌కు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) శివానంద్ టుక్రాల్ స్పందించారు. 2024లో వాదన చాలా దేశాల్లో నిజమే కానీ భారత్‌లో మాత్రం కాదు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. మెటాకు భారత్ అతి మఖ్యమైన భాగస్వామి. ఈ దేశ సృజనాత్మక భవిష్యత్తులో మేమూ కీలక పాత్ర పోషించడానికి ఎదురుచూస్తున్నామని రాసుకొచ్చారు.
జనవరి 10న జుకర్‌బర్గ్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జరిగిన ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. 2024 అతిపెద్ద ఎన్నికల ఏడాదిగా నిలిచింది. భారత్ సహా అనేక దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో ప్రతిచోటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయి. అది ద్రవ్యోల్బణం వల్ల కొవొచ్చు. లేదా కొవిడ్‌ను ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాల వల్ల కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం కనిపించింది. అని మెటా అధినేత వ్యాఖ్యానించారు. దీంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ జుకర్‌బర్గ్ వాదనను తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్ తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయని అని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220 కోట్ల వ్యాక్సిన్లు అందించడంతో పాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోడీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయని అశ్వినీ వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు.