ట్రంప్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్షాలున్నాయని కోర్టు ఈ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని స్పష్టం చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిపై కన్నేసిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగే పోటీకి కూడా ఆయన సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొలరాడో ఉన్నత న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా న్యాయస్థానం ఆయనపై అనర్హత వేటువేసింది. 2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత వేటుపడటం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.
ఇక.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్షాలున్నాయని కోర్టు ఈ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని స్పష్టం చేసింది. కొలరాడో కోర్టు 4–3 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. దీనిపై యూఎస్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌కు అవకాశం కల్పించింది. ఇందుకోసం 2024 జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
2021 జనవరి 6 నాటి దాడిని ట్రంప్ ప్రేరేపించినట్టు గతంలో కొలరాడోలోని ఓ జిల్లా కోర్టు కూడా ధ్రువీకరించింది. అయితే, అందుకు ట్రంపు అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం లేదని నాడు ఆ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఆ తీర్పును తోసిపుచ్చుతూ కొలరాడో ఉన్నత న్యాయస్థానం ప్రైమరీలో పోటీపడేందుకు డొనాల్డ్ ట్రాంప్ అనర్హుడని తేల్చి చెప్పింది. దీంతో ఈ తీర్పుపై ట్రంప్ అటార్నీ యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైంది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.