Telugu Global
International

ఢీ కొట్టిన ఉల్కలు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు భారీ నష్టం

ఉల్కాపాతం చేసిన నష్టం వల్ల జేమ్స్ వెబ్ పంపించే చిత్రాల నాణ్యత ఏ మాత్రం తగ్గదు. కానీ మిర్రర్, సన్‌షీల్డ్‌ల జీవితకాలం క్రమంగా తగ్గిపోతుందని ఆ టెలిస్కోప్ డిజైన్ చేసిన ఇంజనీర్లు చెప్తున్నారు

ఢీ కొట్టిన ఉల్కలు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు భారీ నష్టం
X

హబుల్ టెలిస్కోప్ కంటే అత్యంత పవర్ ఫుల్, ఇన్‌ఫ్రారెడ్ విధానంలో పనిచేసే అతి భారీ టెలిస్కోప్ జేమ్స్ వెబ్. నాసాతో పాటు కెనడా, యూరోపియన్ స్పేస్ సంస్థలు కలిసి ప్రయోగించిన ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోస్ ఇటీవలే మానవుడు ఇంత వరకు చూడని అద్భుతమైన దృశ్యాలను పంపించింది. అయితే భూమి మీదకు ఆ చిత్రాలను పంపించక ముందే, అంటే మే 22న జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు భారీ నష్టం జరిగినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మే 22న వరుసగా ఆరు చిన్న ఉల్కలు ప్రధానమైన మిర్రర్‌ను ఢీ కొట్టాయి. తొలి ఐదు ఉల్కలు ఢీ కొట్టిన సమయంలో మిర్రర్‌కు ఏమీ జరగలేదు. కానీ ఆరో ఉల్క మాత్రం తీవ్రమైన నష్టాన్ని కలిగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అద్భుతమైన చిత్రాలను పంపించింది. దీంతో పెద్దగా నష్టం జరగలేదని అనుకున్నారు. కానీ తాజాగా టెలిస్కోప్ పనితీరును మరోసారి పరిశీలించగా.. సరిదిద్దలేని భారీ నష్టం జరిగినట్లు గుర్తించారు. ఆ ఒక్క ఉల్క కారణంగా నాసా ముందుగా వేసుకున్న అంచనాలన్నీ మారిపోయినట్లు తెలుస్తున్నది.

ఉల్కాపాతం చేసిన నష్టం వల్ల జేమ్స్ వెబ్ పంపించే చిత్రాల నాణ్యత ఏ మాత్రం తగ్గదు. కానీ మిర్రర్, సన్‌షీల్డ్‌ల జీవితకాలం క్రమంగా తగ్గిపోతుందని ఆ టెలిస్కోప్ డిజైన్ చేసిన ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ ప్రమాదం జరిగిన తర్వాత నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. ''ప్రస్తుతం జేమ్స్ వెబ్‌ను ఉంచిన ప్రాంతం సన్-ఎర్త్ ఎల్‌2 అని అంటారు. అక్కడ చిన్నపాటి ధూళి కణాలు అత్యంత వేగంతో పరిభ్రమిస్తుంటాయి. వాటి వల్ల మిర్రర్స్‌కు ఎలాంటి నష్టం జరుగకుండా నిర్మించాము. దానికి తగిన విధంగా భూమిపైనే టెస్టులు కూడా చేశాము. అయితే మేం పరీక్ష జరిపిన సమయంలో ఉపయోగించిన కణాల కంటే కాస్త పెద్దవే అక్కడ ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తున్నది. అందుకే మిర్రర్స్‌కు నష్టం జరిగింది'' అని నాసా వెల్లడించింది.

ప్రస్తుతానికి అయితే టెలిస్కోప్‌ అద్భుతంగా పని చేస్తుందని.. మానవుడు ఇప్పటి వరకు చూడని ఇతర మిల్కీ వేలను కూడా చూసే అవకాశం లభించిందని నాసా అంటోంది. బిగ్ బ్యాంగ్, నక్షత్రాల పుట్టుక, నాశనం.. బ్లాక్ హోల్స్ రహస్యాలు ఈ టెలిస్కోప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్నది.

First Published:  20 July 2022 9:58 AM IST
Next Story