Telugu Global
International

మర్డర్ చేసి పారిపోయినప్పుడు పేదవాడు.. 29 ఏళ్ల తర్వాత మిలియనీర్‌గా అరెస్టు

జియాంగ్ అనే వ్యక్తి 1993లో ఎదురింటి అతనితో గొడవ పడ్డాడు. ఆ వివాదం ఘర్షణగా మారి అతడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత తన తల్లిని తీసుకొని పారిపోయాడు.

మర్డర్ చేసి పారిపోయినప్పుడు పేదవాడు.. 29 ఏళ్ల తర్వాత మిలియనీర్‌గా అరెస్టు
X

పక్కింటి వ్యక్తితో ఉన్న వివాదం నేపథ్యంలో అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. ఓ భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్న సమయంలో ఆ హత్య చేసి.. తన తల్లిని తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. కానీ, అతడి కోసం 29 ఏళ్ల పాటు గాలించిన పోలీసులు చివరకు జాడ కనిపెట్టి అరెస్టు చేశారు. అయితే పారిపోయే సమయంలో పేదవాడిగా ఉన్న ఆ వ్యక్తి.. అరెస్టు చేసే సమయంలో మిలియనీర్‌గా కనిపించడం విశేషం. ఈ సంఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

జియాంగ్ అనే వ్యక్తి 1993లో ఎదురింటి అతనితో గొడవ పడ్డాడు. ఆ వివాదం ఘర్షణగా మారి అతడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత తన తల్లిని తీసుకొని పారిపోయాడు. తాను ఉంటున్న హ్యుబే ప్రావిన్స్‌లోని జియాంగ్‌యాంగ్ అనే ఊరి నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హుయిజౌ అనే నగరానికి చేరుకున్నాడు. అక్కడే నిందితుడు.. తల్లితో కలసి నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడి నుంచి వ్యాపారిగా మారిపోయాడు. హత్య కేసు నిందితుడు జియాంగ్‌లో ఉన్నాడని 29 ఏళ్ల తర్వాత తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు.

హుయిజౌ నగరంలో ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకుంటే.. మళ్లీ పారిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. అందుకే కరోనా కట్టడి సిబ్బంది పేరుతో అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఖరీదైన ఫ్లాట్‌లో నివసిస్తుంది హత్య కేసు నిందితుడే అని రూఢీ చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. 'ఇక నీ అజ్ఞాతవాసం ముగిసింది. మేం ఎందుకు వచ్చామో నీకు అర్థమయ్యిందిగా.. ఇక పద' అంటూ అతడిని అరెస్టు చేసి తీసుకొని పోయారు.

First Published:  11 Nov 2022 7:54 PM IST
Next Story