ప్రపంచ దేశాల్లో చైనా గుబులు - ఆంక్షల ఎత్తివేతతో చైనా నుంచి భారీగా విదేశీ యాత్రలకు సిద్ధం
చైనా బుకింగ్ వెబ్‌సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలుగా కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధన కూడా చైనా ఎత్తేస్తుండటంతో పలువురు చైనా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
కోవిడ్ మహమ్మారి చైనాను చుట్టేస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం విదేశీ ప్రయాణాలకు ఆంక్షలు తొలగించడంపై ప్రపంచ దేశాల్లో గుబులు రేగుతోంది. చైనా ప్రయాణికులతో పాటు కరోనా వైరస్ కూడా మరోసారి వచ్చి పడుతుందేమోనని ఆందోళనకు గురవుతున్నాయి.
కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కడంతో అక్కడి ప్రజలు విదేశీ ప్రయాణాలకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటి నుంచే అందుకు ప్లాన్లు చేసుకుంటున్నారు. జనవరి నెలాఖరులో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల సందర్భంగా విదేశాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో సిద్ధమవుతున్నారు. చైనా బుకింగ్ వెబ్‌సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలుగా కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధన కూడా చైనా ఎత్తేస్తుండటంతో పలువురు చైనా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు ఈ పరిణామాలే ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా భయం నుంచి బయటపడి మెరుగవుతున్న పరిస్థితుల్లో మరోసారి ఈ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపిస్తుందేమోనని బెంబేలెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్‌తో పాటు పలు దేశాలు తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకు అమెరికాతో పాటు ఆసియా, పలు యూరప్ దేశాలను సందర్శించే విదేశీ ప్రయాణికుల సంఖ్య చైనా నుంచే ఎక్కువగా ఉండేది.