భారత సరిహద్దుల్లో పెరుగుతున్న చైనా కవ్వింతలు
చైనా భారత దేశాన్ని కవ్విస్తోంది. సరిహద్దుల వద్ద కయ్యానికి కాలుదువ్వుతోంది. కారాకోరం పీఠభూమిలో ఇటీవల ఆ దేశం జరిపిన మిసైల్ పేలుడే ఇందుకు సాక్ష్యం.
వెన్నుపోటు రాజకీయాలంటే చైనానే చెప్పుకోవాలి. ఇండియాతో శాంతి చర్చలంటూనే బోర్డర్ లో టెన్షన్ సృష్టిస్తోంది. ఇండియాను కయ్యానికి కవ్విస్తున్నట్టు రోజుకో ప్రయోగం చేస్తోంది. భారత ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం డ్రాగన్ కంట్రీకి 'వరమైనట్టు' కనిపిస్తోంది. సరిహద్దుల్లోని కారాకోరం పీఠభూమిలో ఇటీవల ఆ దేశం జరిపిన మిసైల్ పేలుడే ఇందుకు సాక్ష్యం. భూమినుంచి గగనతలానికి ప్రయోగించే అధునాతన డిఫెన్స్ మిసైల్ సిస్టం ని చైనా సైన్యం ప్రయోగించింది. ఇది స్వల్ప దూర లక్ష్యాన్ని ఛేదించగలదట. అది కూడా ఇండియా స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ .. ఈ నెల 15 ఇండిపెండెన్స్ డే నాడు జరిగిన ఈ వైనం.. ఆశ్చర్యాన్నే కాదు.. ఆందోళన కలిగించేది కూడా.. ఈ టెస్ట్ తాలూకు దృశ్యాలను చైనా స్టేట్ మీడియా ఆ రోజున లైవ్ గా ప్రసారం చేయడం విశేషం. భూమికి 4,500 మీటర్ల ఎత్తున జరిగిందీ టెస్ట్.. హెచ్.క్యూ.-17 ఏ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి సామర్థ్యాన్ని నాడు పరీక్షించారు. కేవలం ఓ సింగిల్ వెహికల్ లో దీన్ని అమర్చుకోవచ్చునట. అక్టోబరులో భారత-అమెరికా విన్యాసాలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో .. వాటికన్నా ముందే తన సత్తా చాటడానికి జిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ ఈ ప్రయోగం నిర్వహించింది. ఈ లేటెస్ట్ క్షిపణి భూమికి దగ్గరగా .. కిందుగా ఎగురుతున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఛేదించింది. కారాకోరం సమీపంలో జరిగిన ఈ ప్రయోగం గురించి మనకు నిఘావర్గాల నుంచి సమాచారమే లేదు.. గత ఏడాది మే లో లాంచ్ చేసిన సిస్టం లో ఈ ప్రయోగం ఓ భాగమేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మాజీ అధికారి 'యా గాంగ్ ' చెప్పారు. దీని పనితీరును, రాడార్ ట్రాకింగ్ సామర్థ్యాన్ని, సెర్చ్ ని పెంచేందుకు ఈ మిసైల్ కి మరిన్ని 'మెరుగులు' దిద్దినట్టు తెలిపాడు.
శత్రు బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు .. కౌంటర్ మెజర్ గా హై ప్రొఫైల్ ఫైర్ స్ట్రైక్ అన్నది తమ ఆర్మీ లక్ష్యమని ఆయన చెప్పాడు. ఇప్పటికే వాస్తవాధీన రేఖ పొడవునా చైనా సైన్యం తన కదలికలను ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత-చైనా మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడం కూడా డ్రాగన్ కంట్రీకి కలిసివచ్చింది. ఇప్పటికే ఉభయ దేశాల కమాండర్ల మధ్య జరిగిన చర్చలు ఎక్కడవేసిన గొంగళి అన్నట్టు అక్కడే ఉన్నాయి.. 2020 ఏప్రిల్ కి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలన్న భారత ప్రతిపాదనకు చైనా కిమ్మనలేదు. హాట్ స్ప్రింగ్స్, డెమ్ చోక్, డెప్సంగ్ వంటి ఫ్రిక్షన్ ఏరియాల్లో ఇలాంటి పరిస్థితిని కొనసాగించాలన్న భారత సూచనపై చర్చలు ముందుకు సాగలేదు.
లడఖ్ బోర్డర్లో చైనా నిర్మిస్తున్న అధునాతన గ్రామాలు రోజురోజుకీ శాటిలైట్ ఇమేజీల్లో క్లియర్ గా కనిపిస్తున్నా భారత ప్రభుత్వం ఆ దేశానికి నిరసన తెలియజేయడం లేదు.. కనీసం తాజా పరిస్థితులపై చర్చను గట్టిగా జరపాలన్న యోచన కూడా మోడీ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు.. ఒకేసులో యావజ్జీవ శిక్ష పడిన 11 మంది రేపిస్టుల విడుదల కోసం చూపిన చొరవలో కొంతయినా ..'చైనా దూకుడు' మీద చూపి ఉంటే ఇలాంటి మిసైళ్ళ పరీక్షలను అదుపు చేసి ఉండేవాళ్ళమేమో !