Telugu Global
International

చైనా మళ్ళీ కవ్విస్తోంది.. వాస్తవాధీన రేఖ వద్ద ఫైటర్ జెట్ విమానాలు

భారత్ సరిహద్దుల్లో చైనా మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తూర్పు లడాఖ్ గగనతలం మీద ఆ దేశ అత్యాధునిక యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి.

చైనా మళ్ళీ కవ్విస్తోంది.. వాస్తవాధీన రేఖ వద్ద ఫైటర్ జెట్ విమానాలు
X

సరిహద్దు సమస్యపై ఓ వైపు ఇండియాతో చర్చలు అంటూనే మరోవైపు చైనా కవ్విస్తోంది. తన వక్ర బుద్ధిని చాటుకుంటోంది. ఇటీవలే డొక్లామ్ భూభాగంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నట్టు శాటిలైట్ ఇమేజీలు వెలుగులోకి రాగా.. తాజాగా ఇప్పుడు ఏకంగా తూర్పు లడాఖ్ గగనతలం మీద ఆ దేశ యుద్ధ విమానాలే ఎగురుతున్నాయి. నియంత్రణ రేఖకు సమీపంలో జె-11 వంటివే కాక అత్యాధునిక యుద్ధ విమానాలు ఎగురుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నోసార్లు వీటిని గమనించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లడాఖ్ ప్రాంతంలో ఇండియన్ డిఫెన్స్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకే చైనా వీటిని రంగంలోకి దింపినట్టు భావిస్తున్నారు. గత మూడు, నాలుగు వారాలుగా ఈ విమానాలు తరచూ ఎగురుతూ వచ్చాయట. ఇది నిజంగా ఒప్పంద ఉల్లంఘనే ! నియంత్రణ రేఖకు సమీపంలో 10 కిలో మీటర్ల మేరా 'కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్' లైన్ కి సంబంధించిన ఒడంబడికను అతిక్రమించడమేనని ప్రభుత్వ వర్గాలు తప్పు పట్టాయి. అయితే ఇదే సమయంలో ఇండియాకూడా తక్కువేమీ తినలేదు. రఫెల్ మిగ్-29, మిరేజ్ 2000 విమానాలతో సహా తన ఆధునిక విమానాలను రెడీగా మోహరించింది. సరిహద్దుల్లో.. ముఖ్యంగా లడాఖ్ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు ఇండియా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది.

2020 . .. ఏప్రిల్-మే నెలల్లో వాస్తవాధీన రేఖ వద్ద యధాతథ పరిస్థితిని కొనసాగించేలా చూడడానికి భారత్ చేసిన యత్నాలను చైనా ఏకపక్షంగా భంగపరచేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు తాజాగా భారత-చైనాల మధ్య ఛుషుల్- మోల్డో బోర్డర్లో 16 వ దఫా కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో చైనా దళాలు తన యుద్ధ విమానాలను మోహరించడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమేనని ఇండియా భావిస్తోంది. ఉభయ దేశాల మధ్య సేనల పాక్షిక ఉపసంహరణకు సంబంధించి చర్చలను మరింత 'ముందుకు తీసుకువెళ్లాలని' ఈ నెల 17 న నిర్ణయించారు. నియంత్రణ రేఖ పొడవునా పశ్చిమ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి అనువుగా ఆయా అంశాలమీద తీర్మానాలను రూపొందించాలని రెండు దేశాల కమాండర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనిపై భారత రక్షణ శాఖ ఓ స్టేట్ మెంట్ కూడా జారీ చేసింది. ఓ సంయుక్త ప్రకటన వెలువడింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ విధమైన నిర్ణయాలు దోహదపడతాయని ఉభయ పక్షాలూ పేర్కొన్నాయి. కానీ ఇంత జరుగుతున్నా 'వెన్నుపోటు' పొడుస్తున్నట్టు చైనా తన వక్ర బుధ్దిని మార్చుకోవడం లేదు. ఆ దేశ యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖ సమీపంలో కాస్త తక్కువ ఎత్తులో కూడా ఎగురుతున్నవైనాన్ని భారత దళాలు మానిటర్ చేస్తున్నాయి. భారత వైమానిక దళాలు అప్రమత్తంగా ఉంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పరిస్థితి మరింత విషమించకుండా చూడడానికి అన్ని యత్నాలు చేస్తున్నట్టు వివరించాయి. ఏమైనా చైనా రెచ్చగొట్టే కార్యకలాపాలు భారత దళాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.





First Published:  25 July 2022 10:40 AM IST
Next Story