Telugu Global
International

అగ్రరాజ్యం అమెరికాపై చైనా గుస్సా

తైవాన్‌ కు ఆయుధాలు సరఫరాపై ఆగ్రహం.. పలు అమెరికా సంస్థలపై ఆంక్షలు

అగ్రరాజ్యం అమెరికాపై చైనా గుస్సా
X

అగ్రరాజ్యం అమెరికాపై చైనా గుస్సా అవుతోంది. తైవాన్‌ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని పేర్కొంటూ అమెరికాకు చెందిన పలు సంస్థల కార్యకలాపాలపై చైనా ఆంక్షలు విధించింది. వారం రోజుల క్రితమే ఏడు సంస్థలపై చర్యలు చేపట్టిన చైనా, తాజాగా మరో పది సంస్థలను ఆ లిస్టులో చేర్చింది. కొన్ని సంస్థలకు ఫైన్‌ కూడా వేసింది. చైనా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌ కు ఆయుధాలు, రక్షణకు సంబంధించిన పరికరాలు అమ్మిన పది సంస్థలను విశ్వసనీయత లేని కంపెనీల జాబితాలో చేర్చామని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఆంక్షలు విధించిన జాబితాలో రేథియాన్‌, జనరల్‌ డైనమిక్స్‌, లాక్‌హీడ్‌ మార్టీన్‌ తదితర అంతర్జాతీయ రక్షణ ఉత్పత్తుల సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఇకపై చైనాలో ఎలాంటి కార్యకలాపాలు సాగించడం కుదరదని తేల్చిచెప్పారు. ఆయా సంస్థల ప్రతినిధులు కూడా చైనాలో అడుగు పెట్టడానికి వీళ్లేదని ఆంక్షలు విధించారు. తైవాన్‌ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుండగా, తాము స్వతంత్రులమని తైవాన్‌ దేశీయులు చెప్తున్నారు. ఈక్రమంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా తైవాన్‌ కు రక్షణపరంగా అండగా నిలిచేందుకు ముందుకు రావడం, ఆయుధాలు విక్రయించేందుకు ఒప్పందం చేసుకోవడంతోనే అగ్రరాజ్యానికి చెందిన రక్షణ సంస్థలపై ఆంక్షలు విధించింది.

First Published:  2 Jan 2025 8:29 PM IST
Next Story