చాట్ జీపీటీ దుమ్ము రేపిందిగా.. - అత్యంత కఠిన పరీక్షలో ఉత్తీర్ణత
వైద్య విద్యార్థులు, శిక్షణలో ఉన్న వైద్యులు రాసే ఈ పరీక్షలో బయో కెమిస్ట్రీ, డయాగ్నస్టిక్ రీజనింగ్, బయో ఎథిక్స్ వంటి పలు అంశాలపై లోతుగా ప్రశ్నలు ఉంటాయి. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్‌లుగా ఉండే ఈ పరీక్షల్లో.. చాట్ జీపీటీ దాదాపు 60 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించింది.
మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీ మరో ఘనత సాధించింది. అత్యంత కఠినమైనదిగా భావించే యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (యూఎస్‌ఎంఎల్ఈ)లో ఉత్తీర్ణత సాధించింది. వైద్య విద్యార్థులు, శిక్షణలో ఉన్న వైద్యులు రాసే ఈ పరీక్షలో బయో కెమిస్ట్రీ, డయాగ్నస్టిక్ రీజనింగ్, బయో ఎథిక్స్ వంటి పలు అంశాలపై లోతుగా ప్రశ్నలు ఉంటాయి. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్‌లుగా ఉండే ఈ పరీక్షల్లో.. చాట్ జీపీటీ దాదాపు 60 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించింది.
కాలిఫోర్నియాలోని అన్సిబుల్ హెల్త్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఇందులో భాగంగా 2022 జూన్ నాటి పరీక్షలో ఇమేజ్ ఆధారిత ప్రశ్నలు మినహా మొత్తం 350 ప్రశ్నలను చాట్ జీపీటీకి సంధించారు. మూడు పరీక్షల్లోనూ చాట్ జీపీటీ 52.4 నుంచి 75 శాతం మధ్యలో స్కోరు చేసిందట. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు సగటున 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఈ అధ్యయన వివరాలను పీఎల్‌వోఎస్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. `అత్యంత కఠినమైన ఈ పరీక్షను మానవ ప్రమేయం అసలే లేకుండా పాసవడం చాలా గొప్ప విషయం. ఈ ఘనత సాధించడం ద్వారా చాట్ జీపీటీ కీలక మైలురాయిని అధిగమించింది.` అని అందులో పేర్కొన్నారు. అన్సిబుల్ హెల్త్ సంస్థ ఇప్పటికే సంక్లిష్టమైన వైద్య పరిభాషతో కూడిన రోగులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలైన భాషలో రాసేందుకు చాట్ జీపీటీనీ ఉపయోగించుకుంటోంది.