నువ్వా - నేనా.. చంద్రయాన్-3కి పోటీగా రష్యా లూనా-25
చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.
చంద్రయాన్-3తో చరిత్ర సృష్టిద్దాం అనుకుంది ఇస్రో.. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌకా చేరుకోని చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరుకుని రికార్డ్ నెలకొల్పాలని భావించింది. అయితే భారత్ కు ఆ అవకాశం కలగకుండా తానే ఆ పని చేసేందుకు రష్యా సిద్ధమైంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మరోసారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపించేందుకు రంగంలోకి దిగింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చంద్రయాన్ -3 ప్రయోగించిన ఒక నెలలోపు రష్యా ఫార్ ఈస్ట్‌లోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25 ప్రయోగించనుంది. ఆగస్టు 11న ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ ఈ ప్రయోగం చేపట్టనుంది.
రష్యా వ్యోమనౌక లూనా-25 1.8 టన్నుల ద్రవ్యరాశిని కలిగి ఉంది. అలాగే 31 కిలోగ్రాముల శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్తుంది. ఈ నెల 11న రష్యా ప్రయోగించనున్న లూనా-25 కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత మరో ఐదు నుంచి ఏడు రోజుల్లో జాబిల్లిపై ల్యాండ్ అవ్వనుంది.ఇదే జరిగితే ఇస్రో నిర్ణయించుకున్న ఆగస్టు 23 తేదీ లేదా అంతకంటే ముందుగానే చంద్రుని దక్షిణ ధ్రువంపై రష్యా ల్యాండర్‌ను దించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3కి మాత్రం జాబిల్లిపై దిగేందుకు 41 రోజుల సమయం పడుతోంది. అయితే రష్యా లూనా-25 దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 కన్నా ముందే దిగితే, అక్కడ అడుగుపెట్టిన తొలిదేశంగా రష్యా చరిత్ర సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్రునిపైకి వెళ్లిన ఏ అంతరిక్ష నౌకా ఇప్పటివరకు చేరని జాబిల్లి దక్షిణ ధ్రువంలో గణనీయమైన పరిమాణంలో మంచు ఉంటుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు, అక్కడ గనుక ల్యాండింగ్ సవ్యంగా జరిగితే.. ఆక్సిజన్, ఇంధనం, నీరు వంటి వనరులపై పూర్తిగా సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు. చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. అటు రష్యా పంపనున్న లూనా-25 కూడా అటూ ఇటుగా అదే సమయంలో ఒకేసారి చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావడం జరగవచ్చు.. దీంతో అవి పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై రష్యా స్పందించింది.
రెండు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రాంతాలు, వాటి లక్ష్యాలు, టైమింగ్ అంతా వేరని తెలిపింది. చంద్రయాన్ 3, చంద్రునిపై 14 రోజులు మాత్రమే గడుపుతుంది. కానీ రష్యా పంపుతున్న లూనా-25 మాత్రం అక్కడ ఒక ఏడాది పాటు ఉండనుంది.