Telugu Global
International

ఇంత జాత్యాంహంకారమా ?

'ఇక్కడ భారతీయుల ఫోటోలు తీయబడవు' అంటూ ఆస్ట్రేలియాలో ఓ పోస్టాఫీస్ ముందు పెట్టిన బోర్డు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపింది. చివరకు ఆ పోస్టాఫీసు భారతీయులకు క్షమాపణలు చెప్పింది

ఇంత జాత్యాంహంకారమా ?
X

ఆస్ట్రేలియాలో జాత్యాహంకారం సాగుతూనే ఉంది. అక్కడ భారతీయులపై అనేక సార్లు, దాడులు జరిగాయి. భారతీయులు హేళనకు గురయ్యారు. ఇప్పుడు అలాంటి కథే మళ్ళీ రిపీట్ అయ్యింది.

అడిలైడ్‌లోని రండిల్ మాల్‌లోని ఆస్ట్రేలియన్ పోస్ట్ ఆఫీస్ వెలుపల జాత్యహంకారంతో కూడిన బోర్డు పెట్టారు. పెద్ద అక్షరాలతో ఇక్కడ భారతీయులకు ఫోటోలు తీయబడవు అని బోర్డు మీద రాశారు. 'మా లైటింగ్, ఫోటో నేపథ్య నాణ్యత కారణంగా మేము దురదృష్టవశాత్తు భారతీయ ఫోటోలను తీయలేము!' అని ఉంది.

ఆస్ట్రేలియన్ పోస్ట్ ఆఫీస్ పెట్టిన ఈ బోర్డుతో దేశంలో పెద్ద వివాదం రగులుకొంది. భారతీయులే కాకుండా అనేక మంది ఆస్ట్రేలియన్లు కూడా ఈ జాత్యాహంకారాన్ని తీవ్రంగా నిరసించారు. రాజకీయ నాయకులు కూడా ఈ చర్యను ఖ‍ండించారు.

ఈ విషయంపై గ్రీన్వే ఫెడరల్ లేబర్ సభ్యుడు, కమ్యూనికేషన్స్ మంత్రి , NSW లేబర్ పార్టీ ప్రెసిడెంట్ మిచెల్ రోలాండ్ ఆస్ట్రేలియన్ పోస్ట్‌కు లేఖ రాశారు. ''అడిలైడ్ పోస్టాఫీసులో ప్రదర్శించబడిన ఆమోదయోగ్యం కాని ఆ బోర్డుకు సంబంధించి ఆస్ట్రేలియా పోస్ట్‌కి లేఖ రాశాను. అక్కడి నుంచి నాకు ప్రతిస్పందన వచ్చినప్పుడు నేను ఒక తెలియజేస్తాను'' అని ఆయన ట్వీట్ చేశారు.

ఓ ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతీయ సంఘం నాయకుడు రాజేంద్ర పాండే ఇలా అన్నారు: "వాస్తవానికి వారు నా రంగు గురించి మాట్లాడుతున్నారు , నేను దానిని వ్యక్తిగతంగా తీసుకున్నాను. చాలా మంది ఇతరులు కూడా వ్యక్తిగతంగానే తీసుకొని బాధపడుతున్నారు." అన్నారు.

తాము పెట్టిన బోర్డు పై వివాదం రేగడంతో ఆస్ట్రేలియన్ పోస్ట్ స్పందించింది. క్షమాపణల లేఖ‌ జారీ చేస్తూ, త్వరలో ఆ బోర్డును తీసివేస్తామని తెలిపింది. అక్కడితో ఆగలేదు, తమ పోస్ట్ ఆఫీస్ తీసిన అనేక భారతీయుల ఫోటోలను భారత కాన్సులేట్ గతంలో తిరస్కరించిందని వారు ఒక వివరణ కూడా ఇచ్చారు.

First Published:  20 Nov 2022 8:10 AM IST
Next Story