Telugu Global
International

ఈస్టర్‌ పండుగకు వెళ్తుంటే.. పెను విషాదం.. - బస్సు లోయలో పడి 45 మంది మృతి

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బోట్స్‌వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా పంచుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు.

ఈస్టర్‌ పండుగకు వెళ్తుంటే.. పెను విషాదం.. - బస్సు లోయలో పడి 45 మంది మృతి
X

ఈస్టర్‌ పండుగ కోసం చర్చికి వెళుతుండగా పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సు 165 అడుగుల లోతులో పడిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఘటనలో బస్సులోని 45 మంది అక్కడికక్కడే మృతిచెందారు. 8 సంవత్సరాల బాలిక మాత్రం తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. దక్షిణాఫ్రికాలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మొత్తం 46 మందితో కూడిన బస్సు గురువారం బోట్స్‌వానా నుంచి మోరియాకు బయలుదేరింది. కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో బస్సు లోయలో పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సైతం చనిపోగా, ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆస్ప‌త్రికి తరలించినట్లు చెప్పారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బోట్స్‌వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా పంచుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు. ఈస్టర్‌ వీకెండ్‌ నేపథ్యంలో వంతెనపై విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుందని స్థానిక యంత్రాంగం తెలిపింది. ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్‌ చర్చ్‌ ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో ఒకటి. ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈ ఘోర దుర్ఘటన జరిగింది.

First Published:  29 March 2024 3:15 AM GMT
Next Story