హామీల అమలులో బ్రిటిష్ నూతన ప్రధాని యూ టర్న్
హామీల అమలులో బ్రిటిష్ నూతన ప్రధాని యూ టర్న్ తీసుకున్నారు. అధిక ఆదాయం గలవారికి పన్నులు తగ్గిస్తామన్న హామీ పై ఆమె వెనక్కి తగ్గారు.
బ్రిటిష్ ప్రధాని లిజ్ ట్రస్ తొలి నాళ్ళలోనే హమీల అమలులో వెనకడుగు వేశారు. అధిక ఆదాయం గలవారికి పన్నులు తగ్గిస్తామన్న హామీ పై యూ-టర్న్ తీసుకున్నారు. ఈ ప్రకటనతో ఆమె హయాంలో ప్రధాన విధాన నిర్ణయాలలో మొదటి వెనకడుగుగా భావిస్తున్నారు. లిజ్ నెల రోజుల క్రిందటే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటికే బ్రిటన్ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ అప్పులతో నిండిపోవడంతో మార్కెట్లు గందరగోళంలో పడ్డాయి. దానికి తోడు జీవన వ్యయ సంక్షోభం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారంనాడు అధిక ఆదాయం గలవారికి పన్ను లు తగ్గించేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లిజ్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.
పాలక కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సదస్సులో రెండవ రోజు, ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్ టాప్ 45 శాతం ఆదాయపు పన్ను రేటును తొలగించే ప్రతిపాదన లేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ నేపథ్యంలో 45 శాతం పన్ను రేటును తగ్గించడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుందని అర్ధమవుతోంది. అందువల్ల ఈ ప్రతిపాదనను కొనసాగంచలేకపోతున్నాం అని అర్ధిక మంత్రి క్వార్టెంగ్ ప్రకటించారు.
సెప్టెంబరు 23న క్వార్టెంగ్ ఆవిష్కరించిన తన వివాదాస్పద మినీ-బడ్జెట్‌లో ఈ పన్ను తగ్గింపు ప్రతిపాదనలు చేశారు. సంవత్సరానికి 1,67,400 డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న బ్రిటిషర్లకు వర్తించే విధంగా 45-శాతం రేటును తీసివేయాలని క్వార్టెంగ్ ప్రతిపాదించారు. అయితే ఈ పన్ను తగ్గింపు హామీలపై మాజీ క్యాబినెట్ మంత్రులు గ్రాంట్ షాప్స్ , మైఖేల్ గోవ్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. వారు ఊహించినట్టుగానే ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.