I-T ‘సర్వే’ తర్వాత BBC కి మద్దతుగా నిల్చిన బ్రిటిష్ ప్రభుత్వం
“మేము BBC కోసం నిలబడతాము. BBCకి నిధులు సమకూరుస్తాము. BBC వరల్డ్ సర్వీస్ చాలా ముఖ్యమైనదని మేము భావిస్తున్నాము. BBCకి సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని మేము కోరుకుంటున్నాము,” అని కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సిడిఓ) జూనియర్ మంత్రి డేవిడ్ రూట్లీ అన్నారు.
బీబీసీ ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో భారతీయ ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడు రోజులపాటు ‘సర్వే’ నిర్వహించిన కొద్ది రోజులకే యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం BBC ని, దాని సంపాదకీయ స్వేచ్ఛను పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సమర్థించింది.
ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సిడిఓ) జూనియర్ మంత్రి డేవిడ్ రూట్లీ ఒక అత్యవసర ప్రశ్నకు బదులిస్తూ, బీబీసీపై భారత ఐటి డిపార్ట్‌మెంట్ ఆరోపణలపై తాము వ్యాఖ్యానించలేనప్పటికీ, వాక్ స్వాతంత్య్రం, మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్య పటిష్టతకు అత్యవసరమని భావిస్తున్నామని చెప్పారు.
“మేము BBC కోసం నిలబడతాము. BBCకి నిధులు సమకూరుస్తాము. BBC వరల్డ్ సర్వీస్ చాలా ముఖ్యమైనదని మేము భావిస్తున్నాము. BBCకి సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని మేము కోరుకుంటున్నాము,” అని రట్లీ అన్నారు.
"ఇది మమ్మల్ని (కన్సర్వేటివ్స్) విమర్శిస్తుంది, ఇది లేబర్ పార్టీని విమర్శిస్తుంది. అది మీడియాకు అత్యంత ముఖ్యమైన, తప్పకుండా ఉండవల్సిన స్వేచ్చ. ఆ స్వేచ్ఛ కీలకం, భారతదేశంలోని ప్రభుత్వంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా స్నేహితులకు ఆ స్వేచ్చ ప్రాముఖ్యతను తెలియజేస్తాం. ”అన్నారాయన.
BBC సంపాదకీయ, కార్యాచరణ పరంగా స్వతంత్రంగా ఉందని, UKతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని రట్లీ అన్నారు.
ఈ అంశంపై UK, భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక పద్ధతిలో చర్చిస్తోందని రట్లీ చెప్పారు.
భారత్ తో సంభాషణలలో భాగంగా, బీబీసీ సమస్య లేవనెత్తాము. మేము పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నాము." అని అన్నారాయన.
నార్తర్న్ ఐర్లాండ్ ఎంపీ జిమ్ షానన్ ఈ అత్యవసర ప్రశ్నను లేవనెత్తారు. బీబీసీ, భారత ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసినందువల్లే బీబీసీని బెదిరించడానికి భారత I-T శాఖ ఉద్దేశపూర్వక ఈ దాడులకు పాల్పడిందని జిమ్ షానన్ ఆరోపించారు.. “ఏడు రోజుల క్రితం దాడులు జరిగాయి. అప్పటి నుంచి విదేశీ, కామన్వెల్త్, డెవలప్‌మెంట్ ఆఫీస్ మౌనంగా ఉంది. ప్రభుత్వ ఎటువంటి ప్రకటనలు జారీ చేయలేదు. పత్రికా స్వేచ్ఛపై జరిగిన ఈ కఠోర దాడిని ఖండిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకే ఈ అత్యవసరమైన ప్రశ్నను లేవనెత్తాల్సి వచ్చింది” అని డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (DUP) పార్లమెంటు సభ్యుడు షానన్ అన్నారు.
అంతేకాకుండా, బ్రిటిష్ సిక్కు లేబర్ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ ధేసీ కూడా బీబీసీ మీద ఐటీ దాడులపై తన ఆందోళనలను వ్యక్తం చేస్తూ, “ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛల విలువల గురించి మాట్లాడే భారతదేశం, ఒక డాక్యుమెంటరీ ప్రసారం తర్వాత BBC కార్యాలయాలపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకం'' అన్నారు.
రట్లీ దీనిపై స్పందిస్తూ, "ఈ సమస్యలు ఖచ్చితంగా భారత్ తో సంభాషణలలో భాగంగా లేవనెత్తాము." అని తెలిపారు.
భారత అధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలపై దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి కాదని ఇతర ప్రతిపక్ష ఎంపీలు ఎత్తి చూపారు.