Telugu Global
International

కారు స్టీరింగ్ కి బ్రీత్ అనలైజర్.. తాగితే ఇంజిన్ స్టార్ట్ కాదు

తాగుబోతులు కారు ఇంజిన్ స్టార్ట్ చేయాలని చూసినా ఫలితం ఉండదు. తాగుబోతుల బండ్లకు బ్రీత్ అనలైజర్ ని అమరుస్తున్నారు పోలీసులు. వారి వాహనమే వారిని నిలువరించేలా ఈ పద్ధతి అమలులోకి తెచ్చారు.

కారు స్టీరింగ్ కి బ్రీత్ అనలైజర్.. తాగితే ఇంజిన్ స్టార్ట్ కాదు
X

తాగి వాహనం నడిపితే జరిమానా వేస్తారు, మహా అయితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. లైసెన్స్ లేకపోయినా వాహనం నడిపేందుకు తాగుబోతులు వెనకాడరు. కానీ వారి వాహనమే మొరాయిస్తే, తాగి నడిపేందుకు సిద్ధమైనప్పుడు ఇంజిన్ స్టార్ట్ కాకపోతే.. ఈ ఐడియా ఏదో బాగుంది కదూ. అవును, ఇదిప్పుడు ఆస్ట్రేలియాలో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. తాగుబోతులు కారు ఇంజిన్ స్టార్ట్ చేయాలని చూసినా ఫలితం ఉండదు. తాగుబోతుల బండ్లకు బ్రీత్ అనలైజర్ ని అమరుస్తున్నారు పోలీసులు. వారి వాహనమే వారిని నిలువరించేలా ఈ పద్ధతి అమలులోకి తెచ్చారు.

ఆస్ట్రేలియాలో శిక్షలు ఇలా..

తక్కువమోదాదులో తాగి పోలీసులకు పట్టుబడితే 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్ బ్యాన్ చేస్తారు. 587 ఆస్ట్రేలియన్‌ డాలర్లు జరిమానాగా విధిస్తారు. ఎక్కువ మోతాదులో తాగితే.. సంవత్సరం పాటు కారుకు బ్రీత్‌ అనలైజర్‌ ని పెడతారు. ఆ తర్వాత ప్రతిసారీ సదరు వ్యక్తి కారు స్టార్ట్ చేయాల్సినప్పుడు ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ పాస్ కావాలి. అది అనుమతి ఇస్తేనే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే కారు స్టార్ట్ కాదు. సరదాగా వీకెండ్ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లి మందుకొట్టి ఇంటికి తిరిగొద్దామనుకుంటే ఇక కుదరదన్నమాట. తీరా మందు కొట్టాక ఇంజిన్ స్టార్ట్ కాకపోతే అదో పెద్ద తలనొప్పి. అందుకే మందుబాబులు ఆ అలవాటుకి దూరంగా ఉంటారని, తాగి వాహనం నడపరని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలా ప్లాన్ చేసింది. ఈ కొత్త నిబంధన అక్కడ విజయవంతం అయిందని అంటున్నారు అధికారులు.

ఏడాది తర్వాత కారుకు ఉన్న బ్రీత్ అనలైజర్ ని అధికారుల సమక్షంలోనే తీసేయాల్సి ఉంటుంది. తాగుబోతుల కార్లకు బ్రీత్ అనలైజర్ ని పెట్టడంతోపాటు, ఏడాది తర్వాత వాటిని పోలీసులే తీసేస్తారు. ఆ తర్వాత మళ్లీ పట్టుబడితే దాన్ని మరోసారి కారుకి అమరుస్తారు. ఇలాంటి బ్రీత్ అనలైజర్లు ఉన్న కార్లకు రీసేల్ వేల్యూ కూడా ఉండదు. దీంతో చాలావరకు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది.

భారత్ లో ప్రస్తుతం తొలిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. రెండోసారి పట్టుబడితే 15వేల రూపాయల వరకు ఫైన్, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అమెరికా, యూకే, కెనడాలో కూడా జరిమానా, జైలుశిక్ష ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మాత్రమే కారుకి బ్రీత్ అనలైజర్ బిగించే శిక్ష అమలులో ఉంది.

First Published:  5 Jan 2023 9:13 AM IST
Next Story