Telugu Global
International

కిడ్నాప్‌కు గురైన చిన్నారి సహా ఆ నలుగురూ తోటలో శవాలై తేలారు.!

కిడ్నాప్‌కు గురైనవారిలో ఒకరి బ్యాంకు ఏటీఎం కార్డు ఉపయోగించినట్లు గుర్తించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలోని దుండగుడి ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. అయితే, ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే సమీపంలోని ఓ తోటలో నలుగురి శవాలను గుర్తించారు.

కిడ్నాప్‌కు గురైన చిన్నారి సహా ఆ నలుగురూ తోటలో శవాలై తేలారు.!
X

అమెరికాలోని కాలిఫోర్నియాలో కిడ్నాప్‌నకు గురైన సిక్కు కుటుంబం ఘటన విషాదాంతమైంది. భార్యాభర్తలు, 8 నెలల చిన్నారి పాప, వారి బంధువు ఓ తోటలో విగతజీవులై పడి ఉండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ నిందితుడిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడే హత్య చేశాడా అనే విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. కాగా, కస్టడీలో ఉన్న సమయంలో అతడు ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు బుధవారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భారత సంతతికి చెందిన జస్దీప్ సింగ్ (36), ఆయన భార్య జస్లీన్ కౌర్(27) కలిసి ట్రక్కు రవాణా వ్యాపారం చేస్తున్నారు. వాళ్లు కాలిఫోర్నియాలోని మెర్సిడెస్ కౌంటీలో నివాసం ఉంటూ ప్రతీ రోజు ఉదయం ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్తుంటారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం భార్యభర్తలు తమ 8 నెలల చిన్నారి పాపతో పాటు భార్య సోదరుడు అమన్‌దీప్ సింగ్ (39)తో కలిసి ఆఫీస్‌కి వెళ్లారు. వాళ్లు ఆఫీస్ దగ్గరకు చేరుకున్న తర్వాత ఓ అగంతకుడు గన్‌తో బెదిరించి కిడ్నాప్ చేశారు. ఓ వ్యక్తి నలుగురిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమేరాల్లో నిక్షిప్తం అయ్యాయి.

ఈ వీడియోలో జస్దీప్ సింగ్, అమన్‌దీప్ సింగ్ చేతులు కట్టేసి ఉండగా.. చిన్నారిని, జస్లీన్‌ని అగంతకుడు తుపాకీతో బెదిరిస్తున్నట్లు కనపడుతోంది. ఈ నలుగురినీ బలవంతంగా ట్రక్ ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, వారి కార్యాలయం ముందు పార్క్ చేసిన కారు ఒకటి తగలబడి పోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారు నెంబర్ ఆధారంగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పోలీసులు ఆరా తీశారు. అయితే తమకు ఏమీ తెలియదని వాళ్లు ఆఫీస్‌కు వెళ్లారని చెప్పారు. దీంతో పోలీసులు కార్యాలయానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా కిడ్నాప్‌కు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.

కిడ్నాప్‌కు గురైనవారిలో ఒకరి బ్యాంకు ఏటీఎం కార్డు ఉపయోగించినట్లు గుర్తించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలోని దుండగుడి ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. అయితే, ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే సమీపంలోని ఓ తోటలో నలుగురి శవాలను గుర్తించారు. ఆ నలుగురిని ఎందుకు కిడ్నాప్ చేశారు? హత్యల వెనుక కారణం ఏంటి? పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే విషయాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కేసును ఎఫ్‌బీఐకి బదిలీ చేయడంతో వాళ్లు విచారణ కొనసాగిస్తున్నారు.

First Published:  6 Oct 2022 2:40 PM IST
Next Story