బర్మింగ్‌హామ్ లార్డ్ మేయర్‌గా ఎన్నికైన తొలి బ్రిటిష్-ఇండియన్
50 ఏళ్ల చరిత్ర కలిగిన బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్‌కు చమన్ లాల్ తొలి బ్రిటిష్-ఇండియన్ లార్డ్ మేయర్ కావడం విశేషం.
ఇంగ్లాండ్‌లోని ప్రముఖ నగరమైన బర్మింగ్‌హామ్‌కు తొలి సారిగా ఒక బ్రిటిష్-ఇండియన్ లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యాడు. పంజాబ్‌కు చెందిన చమన్ లాల్ బర్మింగ్‌హామ్ మేయర్‌గా ప్రమాణం చేశారు. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్‌కు చమన్ లాల్ తొలి బ్రిటిష్-ఇండియన్ లార్డ్ మేయర్ కావడం విశేషం.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా పఖోవల్ గ్రామంలో పుట్టిన చమన్ లాల్.. తన తల్లితో కలిసి 1964లో ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. అతని తండ్రి సర్దార్ హర్నామ్ సింగ్ అప్పటికే బ్రిటిష్-ఇండియన్ ఆర్మీలో అధికారిగా పని చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలోని ఇటాలియన్ క్యాంపులో పని చేసిన హర్నామ్ సింగ్.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు.
చమన్ లాల్ ఇంగ్లాండ్‌లోని వాట్‌విల్లే సెకండరీ మోడ్రన్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న చమన్ లాల్ 1989లో లేబర్ పార్టీలో చేరారు. సామాజిక న్యాయం కోసం జరిగిన అనేక ఆందోళనల్లో చమన్ లాల్ పాల్గొన్నారు. ఇంగ్లాండులో ఉన్న అన్ని రకాల వివక్ష, అసమానతలపై జరిగిన పోరాటాల్లో చమన్ లాల్ క్రియాశీలకంగా పాల్గొన్నారు.
1994లో తొలి సారిగా సోహో అండ్ జ్యూవెలరీ క్వార్టర్ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గత 30 ఏళ్లుగా సిటీ కౌన్సిల్‌కు ఎన్నికవుతూ వస్తున్నారు. చమన్ లాల్‌కు కౌన్సిలర్‌గా ఉన్న సుదీర్ఘ అనుభవం కారణంగా ఆయనను లార్డ్ మేయర్‌గా ఎన్నుకున్నారు.
బర్మింగ్‌హామ్ నగరానికి లార్డ్ మేయర్‌గా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని, ఇది నాకు ఒక గర్వకారణమని చమన్ లాల్ అన్నారు. ముప్పై ఏళ్ల క్రితం కౌన్సిలర్‌గా ఎన్నికయినపుడు.. ఏదో ఒక రోజు లార్డ్ మేయర్ అవ్వాలని కలలు కన్నానని.. ఈ రోజు అది సాకారం అయ్యిందని లాల్ చమన్ చెప్పారు. సిటీకి తొలి పౌరుడిగా నాకు లభించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. బర్మింగ్‌హామ్ నగరం తరపున స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధిగా వ్యవహరించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బర్మింగ్‌హామ్‌కు తొలి పౌరురాలిగా చమన్ లాల్ భార్య విద్యావతి వ్యవహరించనున్నారు.