Telugu Global
International

కమలా హారిస్‌కు బిల్‌గేట్స్‌ భారీ విరాళం!

ఆమెకు మద్దతు ఇస్తున్న 'ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌' ఎన్జీవో సంస్థకు రూ. 420 కోట్లు బదిలీ చేసినట్లుగా అమెరికా పత్రికల్లో కథనాలు

కమలా హారిస్‌కు బిల్‌గేట్స్‌ భారీ విరాళం!
X

అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు మైక్రోసాఫ్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ భూరి విరాళం ప్రకటించినట్లు సమాచారం. ఆమెకు మద్దతు ఇస్తున్న 'ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌' ఎన్జీవో సంస్థకు రూ. 420 కోట్లు బదిలీ చేసినట్లుగా అమెరికా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. హారిస్‌కు నేరుగా మద్దతు ప్రకటించినప్పటికీ మైకోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పరోక్షంగా విరాళం అందించినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పరిస్థితులు ఎలా ఉంటాయోనని బిల్‌గేట్స్‌ తన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి.

ఎన్నికలు చాలా భిన్నమైనవి:బిల్‌గేట్స్‌

దీనిపై స్పందించిన బిల్‌గేట్స్‌ ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవని అభివర్ణించారు. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, పేదరికాన్నితగ్గించడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంలో మార్పులు తేవడానికి కృషి చేస్తున్న వారికి నేను మద్దతు ఇస్తానన్నారు. రాజకీయ నేతలతో పనిచేసిన సుదీర్ఘ అనుభవం నాకు ఉన్నది. అయితే ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవని ఆయన ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగి హారిస్‌కు మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్‌గేట్స్‌ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌ హారిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్రంప్‌ గోల్‌మాల్‌కు పాల్పడకుండా అడ్డుకుంటా:హారిస్‌

మరోవైపు ఎన్నికల ఫలితాల రోజు ట్రంప్‌ గోల్‌మాల్‌కు పాల్పడకుండా అడ్డుకుంటానని హారిస్‌ తెలిపారు. వ్యూహాల్లో భాగంగా ఫలితాలు రాకముందే ట్రంప్‌ గెలిచినట్లుగా ప్రచారం చేస్తారు. అలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మా బృందం సిద్ధంగా ఉందన్నారు. 2020 ఎన్నికల ఫలితాల సమయంలో ట్రంప్‌ మద్దతుదారులు యూఎస్‌ క్యాపిటల్‌పై దాడి చేసిన విషయాన్ని కమలాహారిస్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆయన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: బైడెన్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. రాజకీయంగా అతడిని లాక్‌ చేయాలని వ్యాఖ్యానించారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను ట్రంప్‌ ఓడించినట్లయితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. 2016 ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులు 'లాక్‌ హర్‌ అప్‌' అంటూ హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ నినదిస్తుంటే ట్రంప్‌ నిలువరించలేదన్నారు. ప్రస్తుతం అదే ఫార్ములాను హారిస్‌ మద్దతుదారులు ట్రంప్‌నకు అన్వయిస్తున్నారు.

First Published:  23 Oct 2024 9:43 AM IST
Next Story