Telugu Global
International

బ్యాంకుల దివాళా.. ముందుంది ముసళ్ల పండగ

అమెరికాకు చెందిన చిన్న బ్యాంకులు, రీజినల్‌ బ్యాంకులు ప్రమాదం అంచున ఉన్నాయని చెప్పారు. బ్రిటన్‌ లోని బ్యాంకులు సైతం ఇలాంటి ముప్పుని ఎదుర్కొంటున్నాయన్నారు.

బ్యాంకుల దివాళా.. ముందుంది ముసళ్ల పండగ
X

2008నాటి ఆర్థిక మాంద్యం మరోసారి ప్రపంచాన్ని చుట్టుముట్టబోతోందనడానికి అమెరికా బ్యాంకుల దివాళాను ఒక సంకేతంగా చెబుతున్నారు. అయితే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలినంత మాత్రాన అంతా అయిపోయిందనుకోడానికి లేదు. అదే సమయంలో స్విట్జర్లాండ్ లోని క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ పతనావస్థకు చేరినంత మాత్రాన దీన్ని పెద్ద విపత్తుగా అనుకోడానికి లేదు. కానీ బ్యాంకింగ్ రంగ నిపుణులు మాత్రం వీటిని గట్టి హెచ్చరికలుగా భావించాలని చెబుతున్నారు. బ్యాంకింగ్ సంక్షోభం ముగిసిపోలేదని, వచ్చే ఏడాదిలోగా మరిన్ని బ్యాంకులు కనుమరుగవుతాయని అంటున్నారు.

అమెరికాలో బ్యాంకులు దివాళా తీశాయనే వార్తలు భారత్ సహా ఇతర అన్ని దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఆ తర్వాత వెంటనే కుదురుకున్నాయి. కానీ బ్యాంకింగ్‌ సంక్షోభం ముగిసిపోలేదంటున్నారు హెడ్జ్‌ ఫండ్‌ మ్యాన్‌ గ్రూప్‌ సీఈఓ ల్యూక్‌ ఎల్లిస్‌. బ్లూమ్‌ బెర్గ్‌ నిర్వహించిన సదస్సులో ఆయన బ్యాంక్ ల పతనం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఏమీ అయిపోలేదని, ముందు ముందు మరిన్ని బ్యాంకులు దివాళా తీస్తాయన్నారు. రాబోయే ఏడాదిన్నర కాలం బ్యాంకింగ్ రంగానికి కీలకం అని చెప్పారు. ఏడాదిలోగా మరికొన్ని బ్యాంకులు దివాళా తీయడం గ్యారెంటీ అని చెప్పారు.

అమెరికా, బ్రిటన్ లో..

ప్రస్తుతం బ్యాంకింగ్ సంక్షోభాన్ని అందరూ అమెరికాకే పరిమితం చేస్తున్నారని, కానీ అమెరికాతోపాటు బ్రిటన్ లో కూడా బ్యాంక్ లు కుప్పకూలడం ఖాయమంటున్నారు మ్యాన్ గ్రూప్ సీఈఓ. అమెరికాకు చెందిన చిన్న బ్యాంకులు, రీజినల్‌ బ్యాంకులు ప్రమాదం అంచున ఉన్నాయని చెప్పారు. బ్రిటన్‌ లోని బ్యాంకులు సైతం ఇలాంటి ముప్పుని ఎదుర్కొంటున్నాయన్నారు. వీటి ప్రభావం కేవలం ఆయా దేశాలపై మాత్రమే ఉండదని, బ్యాంకింగ్ రంగంలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో.. ఆ దేశాలన్నిటిపై ఉంటుందని అన్నారు.

First Published:  23 March 2023 6:09 AM IST
Next Story