Telugu Global
International

రిజర్వేషన్ల కోటా తగ్గించాలి.. బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢాకా వర్సిటీలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలతో ఇవి ప్రారంభమయ్యాయి. వీటిని అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్, రబ్బర్‌ బుల్లెట్లు కూడా ప్రయోగించడంతో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి.

రిజర్వేషన్ల కోటా తగ్గించాలి.. బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల రిజర్వేషన్ల వ్యవహారంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వారం రోజులుగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారి.. 100 మందికి పైగా నిరసన కారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఉపశమనం కలిగించినట్లయింది.

1971లో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. అసలే ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ విద్యార్థులు నిరసన తెలియజేయటంతో వెనక్కి తగ్గింది.

తాజాగా బంగ్లా హైకోర్టులో రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడటంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనలు హింసాత్మకంగా మారడంతో ∙100 మందికి పైగా నిరసనకారులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల నిర్ణయంపై నేడు అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వాతంత్య్ర సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించింది. 93 శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది. మిగిలిన రెండు శాతం మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది.

జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. ఆమెకు తాజా ఆందోళనలు తీవ్ర సవాల్‌ విసిరాయి. యూనివర్సిటీలు మూతపడ్డాయి. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మంగళవారం ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఢాకా వర్సిటీలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలతో ఇవి ప్రారంభమయ్యాయి. వీటిని అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్, రబ్బర్‌ బుల్లెట్లు కూడా ప్రయోగించడంతో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో జరిగిన మరణాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. స్థానిక మీడియా మాత్రం 103 మంది మరణించినట్టు శనివారం వెల్లడించింది.

రిజర్వేషన్‌ వ్యవస్థ వివక్షపూరితంగా ఉందని ఆందోళనకారులు ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆవామీ లీగ్‌ పార్టీకి చెందిన హసీనా మద్దతుదారులకు అనుకూలంగా ఉందని నిరసన వ్యక్తం చేశారు. దాని స్థానంలో ప్రతిభ ఆధారిత నియామకాల వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. హసీనా మాత్రం రిజర్వేషన్‌ వ్యవస్థను సమర్థించారు. దేశం కోసం పోరాడిన వారికి గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాజా ఆందోళనల్లో ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ మద్దతుదారులు సైతం పాల్గొన్నారు. వీరి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అధికార పక్షం ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని పేర్కొంది. బీఎన్‌పీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. తాము శాంతియుత నిరసనలకే పిలుపునిచ్చామని వివరణ ఇచ్చింది.

First Published:  21 July 2024 11:13 AM GMT
Next Story