Telugu Global
International

బంగ్లా ప్రధానిగా మళ్లీ హసీనా.. - వరుసగా నాలుగోసారి ఎన్నిక

బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు.

బంగ్లా ప్రధానిగా మళ్లీ హసీనా.. - వరుసగా నాలుగోసారి ఎన్నిక
X

బంగ్లాదేశ్‌ ప్రధానిగా వరుసగా నాలుగోసారి షేక్‌ హసీనానే పగ్గాలు చేపట్టనున్నారు. అక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్‌ పార్టీ విజయం సాధించింది. ఆదివారం పోలింగ్‌ జరగగా, రాత్రి కల్లా తొలి దశ ఫలితాలు వచ్చేశాయి. ఇందులో అందరూ ఊహించినట్టుగానే పాలక పార్టీ అవామీ లీగ్‌ గెలుపొందింది. అక్కడ మొత్తం 300 సీట్లకు గాను 299 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానంలో అభ్యర్ధి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్‌లో అవామీ లీగ్‌ 200 స్థానాలు గెలుపొందినట్టు అధికారులు వెల్లడించారు.

మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీతో పాటు విపక్షాలన్నీ ఈ ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో జనం కూడా ఈ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం 40 శాతం ఓటింగ్‌ నమోదైంది. సాయంత్రం పోలింగ్‌ ముగియగానే ఓట్ల లెక్కింపు ప్రారంభించిన ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించారు.

బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 438 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ పొరుగుదేశం కావడం తమ అదృష్టమని చెప్పారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమానికి భారత్‌ ఎంతగానో సహకరించిందని తెలిపారు. 1975 ఆగస్టులో తన తండ్రిని, తల్లిని, ముగ్గురు సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను సైనికాధికారులు దారుణంగా హత్య చేశారని హసీనా చెప్పారు.

First Published:  8 Jan 2024 4:51 AM GMT
Next Story