Telugu Global
International

రెస్టారెంట్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 44 మంది మృతి

గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో దాదాపు 44 మంది మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయాలపాలయ్యారు.

రెస్టారెంట్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 44 మంది మృతి
X

అదో బిర్యానీ రెస్టారెంట్‌.. ఏడంతస్తుల భవనం.. నిత్యం పెద్ద సంఖ్యలో జనం ఆ హోటల్‌కి వస్తుంటారు. గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో దాదాపు 44 మంది మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని బెయిలీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్‌ ఫోన్ల విక్రయ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన భవనంలో తొలుత కింది అంతస్తులో మంటలు చెలరేగాయని, అవి క్రమంగా పై అంతస్తులకు విస్తరించాయని అగ్నిమాపక శాఖ అధికారి మహ్మద్‌ షిహబ్‌ వెల్లడించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో పై అంతస్తుల్లోని వారు తప్పించుకునేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు.

కింది అంతస్తుల నుంచి పొగ వస్తుండటం.. కింది అంతస్తుల్లో ఉన్నవారు పైకి పరుగెత్తుకుంటూ వస్తుండటంతో తప్పనిసరై అందరూ భవనం నీటి పైపుల ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు. మరికొందరు అందుకు వీలుకాని పరిస్థితుల్లో పైనుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంకొందరు భవనం పైభాగంలోకి చేరుకొని సహాయం కోసం అర్థించారని రెస్టారంట్‌ మేనేజర్‌ సోహెల్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌లో అపార్టుమెంట్లు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లలో ఈ విధంగా తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. 2019లో జరిగిన ఓ ప్రమాదంలో 70 మంది, 2021లో జరిగిన ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

First Published:  1 March 2024 5:09 AM GMT
Next Story