అంగ్ సాన్ సూకీ కి మరో ఆరేళ్ళ జైలు శిక్ష విధించిన మిలిటరీ కోర్టు
మిలటరీ ప్రభుత్వం పాలిస్తున్న మయన్మార్ లో ఆ దేశ నాయకురాలు అంగ్ సాన్ సూకీ కి కోర్టు మరో ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది. గతంలోనే ఆమెకు వేరు వేరు కేసుల్లో కోర్టు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
మయన్మార్ లో ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన నాయకురాలు అంగ్ సాన్ సూకీ ని అక్కడి మిలటరీ పాలకులు ఇంకా వేధిస్తూనే ఉన్నారు. ఆమె పై మిలటరీ పాలనలో ఉన్న మయన్మార్‌లోని ఓ కోర్టు ఆగస్టు 15న మరిన్ని అవినీతి ఆరోపణలపై దోషిగా నిర్ధరించింది.ఆంగ్ సాన్ సూకీని దోషిగా నిర్ధారించి ఆమెకు అదనంగా ఆరేళ్ల జైలు శిక్ష విధించిందని లీగల్ అధికారి ఒకరు తెలిపారు. మీడియాకు, ఇతరులెవరికీ లోపలికి ప్రవేశం లేకుండా నాలుగుగోడల మధ్యే విచారణ జరిపారు. సూకీ తరపు న్యాయవాదులు ఎవరూ విచారణకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఒక గాగ్ ఆర్డర్ ద్వారా నిషేధించారు.
సోమవారం నిర్ణయించిన నాలుగు అవినీతి కేసుల్లో, సూకీ తన పదవిని దుర్వినియోగం చేసి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు ప్రభుత్వ భూమిని అద్దెకు తీసుకున్నారని ఆరోపించారు. దాతృత్వ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన విరాళాలతో నివాసం నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆమె నాలుగు కేసుల్లో ప్రతిదానికి మూడు సంవత్సరాల శిక్షను విధించారు. అయితే వాటిలో మూడింటికి శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని చెప్పడంతో ఆమెకు మొత్తం ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కాగా సూకీ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. ఆమె న్యాయవాదులు అప్పీల్ చేస్తారని భావిస్తున్నారు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఆమె ప్రభుత్వాన్ని2021 ఫిబ్రవరిలో మిలిటరీ తొలగించి, ఆమెను నిర్బంధించింది. తర్వాత విచారణలలో దేశద్రోహం, అవినీతి, ఇతర ఆరోపణలపై 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, ఆమె పైన, ఆమె మిత్రపక్షాలపై అనేక అభియోగాలు మోపడం పై విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యలతో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నమేనని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో ఆమెను రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకు మిలిటరీ ఎత్తుగడలని విమర్శలు వస్తున్నాయి.