బంగ్లాలో మళ్లీ హింస, 70 మంది మృతి
ప్రధాని వ్యాఖ్యలతో నిరసనకారులు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. కోటాకు వ్యతిరేకంగా కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్లలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ వేలాది మంది ఆ దేశ రాజధాని ఢాకాలో రోడ్లెక్కారు. ఇవాళ జరిగిన అల్లర్లలో దాదాపు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనెడ్లను ప్రయోగించారు. ఘర్షణల నేపథ్యంలో ఢాకాలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్‌నెట్ నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. కోటాను వ్యతిరేకిస్తున్న వారిని ప్రధాని షేక్ హసీనా ఉగ్రవాదులుగా పేర్కొనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ప్రధాని వ్యాఖ్యలతో నిరసనకారులు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. కోటాకు వ్యతిరేకంగా కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్లలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండడంతో పాటు రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది. ఇందుకు కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది కేంద్రం.
జనవరిలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బాయ్‌కాట్ చేయగా.. షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని యుద్ధవీరులుగా పేర్కొంటూ వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడింట ఒక వంతు రిజర్వ్ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.