Telugu Global
International

యెమెన్‌ తీరంలో బోటు మునక.. 49 మంది మృతి

ఆఫ్రికాలో పేదరికం నుంచి తప్పించుకోవడానికి , ఏదన్నా పని చేసుకొని బతకవచ్చు అనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి వలసదారులు ప్రయత్నిస్తుంటారు. అలా వలసదారులు వెళ్ళే ప్రాంతాలలో యెమెన్ ఒకటి.

యెమెన్‌ తీరంలో బోటు మునక.. 49 మంది మృతి
X

సోమాలియా, ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ యెమెన్‌ తీరంలో మునిగిపోయింది. ప్రమాదంలో 49 మంది దుర్మరణం చెందారు. మరో 140 మంది కనపడకుండా పోయారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ధ్రువీకరించింది. 260 మంది సోమాలియాలు, ఇథియోపియన్‌లతో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మీదుగా ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ సోమవారం యెమెన్‌ దక్షిణ తీరంలో మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న యెమెన్‌ రెస్క్యూ టీమ్స్‌ సెర్చ్ ఆపరేషన్ చేసి 71 మందిని రక్షించాయి. 49 మృతదేహాలను వెలికితీశాయి. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, 31 మంది మహిళలు ఉన్నారు. 140 మంది గల్లంతవ్వగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఆఫ్రికాలో పేదరికం నుంచి తప్పించుకోవడానికి , ఏదన్నా పని చేసుకొని బతకవచ్చు అనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి వలసదారులు ప్రయత్నిస్తుంటారు. అలా వలసదారులు వెళ్ళే ప్రాంతాలలో యెమెన్ ఒకటి. యెమెన్ ఒక దశాబ్దానికి పైగా రక్తపాత అంతర్యుద్ధంలో మునిగిపోయింది. అయినప్పటికీ 2021 నుండి 2023 వరకు ఏటా వచ్చే వలసదారుల సంఖ్య మూడు రెట్లు, అంటే దాదాపు 27,000 నుండి 90,000కి పెరిగిందని, IOM గత నెలలో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి 3,80,000 మంది వలసదారులు యెమెన్‌లో ఉన్నారు. అయితే, యెమెన్ చేరుకునేందుకు వలసదారులను స్మగ్లర్లు ఎర్ర సముద్రం లేదా ఏడెన్ గల్ఫ్ మీదుగా ప్రమాదకర పరిస్థితిల్లో తరలిస్తుంటారు. ఈ పడవలలో విపరీతమైన రద్దీ ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు ఉండవు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో సైతం జిబౌటీ తీరంలో యెమెన్‌కు చేరేందుకు ప్రయత్నించిన రెండు ఓడల ప్రమాదాల్లో కనీసం 62 మంది మరణించారు.

First Published:  12 Jun 2024 8:55 AM GMT
Next Story