లే ఆఫ్.. లాస్ట్ ఆప్షన్ .. - యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడి
యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో కొంతమంది ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో యాపిల్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టిమ్ కుక్ ఈ ప్రకటన చేయడం వారిలో భయాన్ని తొలగించింది.
లే ఆఫ్‌లు అనేవి తమకు లాస్ట్ ఆప్షన్ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఆర్థిక మాంద్యం భయంతో ప్రపంచంలోని అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్‌లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. యాపిల్ మాత్రం ఇప్పటివరకు లే ఆఫ్‌ల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ లే ఆఫ్‌లపై మాట్లాడారు. అన్ని దారులూ మూసుకుపోయిన తరుణంలో చివరి అంశంగా మాత్రమే లే ఆఫ్‌ల గురించి తాము ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో కొంతమంది ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో యాపిల్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టిమ్ కుక్ ఈ ప్రకటన చేయడం వారిలో భయాన్ని తొలగించింది.
లే ఆఫ్‌ల నిర్ణయాన్ని పూర్తిగా కొట్టేయలేమని కూడా టిమ్ కుక్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే అందరూ మాట్లాడుతున్నట్టుగా లే ఆఫ్‌లు ఇప్పట్లో ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. నియామకాల ప్రక్రియ కూడా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. గతంలో కంటే తక్కువగా వీటిని చేపడతామని ఆయన వివరించారు.
ప్రస్తుతం తమ కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లను సరైన పద్ధతిలో ఎదుర్కొంటున్నామని టిమ్ కుక్ తెలిపారు. యాపిల్ కంపెనీ గత త్రైమాసికంలో 24.1 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది. అందులో ఐఫోన్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే అధికమని వివరించారు. మరోవైపు మ్యాక్ కంప్యూటర్ల అమ్మకాల్లో 30 శాతం క్షీణత నమోదైందని, యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ వంటి వేరబుల్స్ అమ్మకాలు కూడా తగ్గాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వాటి అమ్మకాలపై దృష్టిసారించినట్టు పేర్కొన్నారు.