Telugu Global
International

రాజరికం ఇక చాలు...బ్రిటన్ లో పౌరుల నిరసనలు

బ్రిటన్ లో రాజరికానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పౌరులు రాజరికాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత ఈ నిరసనలు ఊపందుకోవడం గమనార్హం.

రాజరికం ఇక చాలు...బ్రిటన్ లో పౌరుల నిరసనలు
X

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత దేశవ్యాప్తంగా ఒక వైపు సంతాప సభలు జరుగుతుండగా మరో వైపు పౌరులు రాజరికానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో 'నాట్ మైకింగ్' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.

అనేక చోట్ల పౌరులు రాచరికానికి వ్యతిరేకంగా ప్ల కార్డులు ప్రదర్శిస్తున్నారు. రాణి సంతాసభల్లో కూడా రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అనేక చోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

కొత్త రాజు చార్లెస్ III ని ఎవరు ఎన్నుకున్నారని బిగ్గరగా నినదించినందుకు ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన సైమన్ హిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎడిన్ బరో లో కూడా మరో యువకుడు రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు. 'రాజరికం, సామ్రాజ్యవాదం నశించాలి' అని ప్లకార్డును ప్రదర్శించిన మరో మహిళను కూడా ఎడిన్ బరో లో పోలీసులు అరెస్టు చేశారు.

రాణి సంతాప సభల్లో కూడా పౌరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల రోడ్లపై పౌరులు రాచరికానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన , నినాదాలు చేస్తున్నారు.

రాజరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ లో నిరసనలు కొత్త కాదు . చాలా కాలంగా బ్రిటన్ లో రావరికానికి వ్యతిరేకంగా ఒక గ్రూపు పని చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాత్రమే ఉండాలని, రాజరికానికి చరమగీతం పాడాలని ఆ గ్రూపు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నది. ఇప్పటి కాలంలో రాజరికం వంటి కాలం చెల్లిన వ్యవ‌స్థలను కొనసాగించడం సరైంది కాదని, కోట్ల రూపాయల ప్రజాధనం వారి కోసం వృధా చేయవద్దని బ్రిటన్ లో అనేక మంది పౌరులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఇప్పుడు రాణి మరణంతో ఈ వాదన ఊపందుకుంది. అంతే కాక ప్రస్తుత బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాచరికానికి వ్యతిరేకంగా గతంలో చేసిన ఉపన్యాసాలను పౌరులు ఈ సందర్భంగా ముందుకు తీసుకవస్తున్నారు.

మరో వైపు కామన్వెల్త్ పాలనలో ఉన్న జమైకా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాలలో కూడా రాచరికం రద్దు పై డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

కాగా అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే బ్రిటన్ లో నిరసనలు తెలుపుతున్న పౌరులను అరెస్టు చేయడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. నిరసన తెలిపే హక్కును ఎలా కాలరాస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్ర‌పంచ వ్యాప్తంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమాల సందర్భంగా బ్రిటన్ తన చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఆ చట్టాల ఆధారంగానే ప్రస్తుతం నిరసనలు తెలుపుతున్న పౌరులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

First Published:  17 Sept 2022 4:33 AM GMT
Next Story