ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఇది మూడోసారి
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నానికి యత్నించడం కలకలం సృష్టించింది. ఇటీవల కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రెండు గన్‌లతో తిరిగినట్లుగా తమకు సమాచారం వచ్చిందని సీక్రెట్ సర్వీసెస్ పేర్కొన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడిని లాస్‌వెగాస్‌కు చెందిన వేం మిల్లర్‌గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ట్రంప్‌నకు, ర్యాలీకి హాజరైన వారికి గాని ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు.
నిందితుడు నకిలీ ప్రెస్‌కార్డు, ఎంట్రీ పాస్‌తో ర్యాలీ వేదికకు సమీపంలో లోడ్ చేసిన షాట్‌గన్, హ్యాండ్‌గన్, హై కెపాసిటీ గల మ్యాగజైన్‌తో సంచరిస్తుండగాఆ.. అతణ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అంతేగాకుండా నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థలో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సీక్రెట్ సర్వీసెస్ సాయంతో ట్రంప్‌పై జరగబోయే మరో హత్యాయత్నాన్ని ఆపగలిగామని అన్నారు.
ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. గత జులైలో డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ప్రచార సభలో మాట్లాడుతుండగా థామస్ క్రూక్స్ అనే యువకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. వేగంగా స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్‌ను కాపాడింది. మరోసారి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఫెన్సింగ్ నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.