ఆమె ఓటమితోనే అమెరికా రక్షణ సాధ్యం
కమలా హారిస్ అధికారంలోకి వస్తే అమెరికాలో అభివృద్ధి కుంటుపడుతుందని, ఆర్థిక వ్యవస్థ పతనమౌతుందన్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నది. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్ నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఎన్నికలు జరిగిన అనంతరం ప్రజల ఓట్లతో గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తానని ట్రంప్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే దేశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, విపరీత చర్యలకు పాల్పడే నేరస్థులకు కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రజలు తమ ఓటు హక్కుతో హారిస్‌ను ఇంటికి పంపించాలని.. ఆమె ఓటమితోనే అమెరికా రక్షణ సాధ్యమౌతుందన్నారు. తాను అధికారంలోకి వస్తే పన్నులను తగ్గిస్తానని, వేల అమెరికన్ కంపెనీలను వెనక్కి తీసుకొచ్చి కార్మికుల వేతనాలు పెరిగేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే అమెరికాలో అభివృద్ధి కుంటుపడుతుందని, ఆర్థిక వ్యవస్థ పతనమౌతుందని విమర్శించారు. దానివల్ల అమెరికన్లకు కోలులోలేని దెబ్బ తగులుతుందని హెచ్చరించారు.