Telugu Global
International

హోల్‌ సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కు అమెజాన్ గుడ్ బై..

ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారిస్తామని యాజమాన్యం ప్రకటించింది.

హోల్‌ సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కు అమెజాన్ గుడ్ బై..
X

ఈ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ఆమెజాన్, అనేక ఇతర వ్యాపారాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. అయితే ఇటీవల ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగించింది, అదే సమయంలో ఎడ్యుటెక్, ఫుడ్ డెలివరీ వ్యాపారాలను కూడా మూసేస్తున్నట్టు తెలిపింది. తాజాగా ఇప్పుడు హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ కి కూడా అమెజాన్ గుడ్ బై చెప్పబోతోంది.

ఏమిటీ వ్యాపారం..?

అమెజాన్‌ సంస్థ ఈ హోల్‌ సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ‌ను బెంగళూరు, మైసూరు, హుబ్లీ నగరాల్లో నిర్వహిస్తోంది. చిరు వ్యాపారులు ఈ వెబ్‌ సైట్ ద్వారా ఉత్పత్తులను హోల్‌ సేల్ ధరలకే కొనుగోలు చేసుకోవడానికి వీలుండేది. అయితే.. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఇన్నాళ్లూ దీనిపై ఆధారపడిన చిన్న వ్యాపారులకు ఇది ఇబ్బంది కలిగించే నిర్ణయమే. అయినా కూడా ఖర్చుని తగ్గించుకోడానికి అమెజాన్ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు. అయితే ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారిస్తామని యాజమాన్యం ప్రకటించింది.

ఎందుకిదంతా..?

కరోనా సమయంలో అమెజాన్ ఎడ్యుటెక్, అమెజాన్ ఫుడ్ పేరుతో కొత్త కార్యకలాపాలు మొదలు పెట్టింది ఆ సంస్థ. కరోనా సమయంలో ఆన్ లైన్ బోధనకోసం ఎడ్యుటెక్ ని స్థాపించినా దానికి డిమాండ్ తగ్గడంతో ఇటీవలే మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కరోనా సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కోసం అమెజాన్ ఫుడ్ ని కూడా తెరపైకి తెచ్చారు. అది కూడా ఇప్పుడు వర్కవుట్ అయ్యేలా లేదు. దీంతో ఎడ్యుటెక్, ఫుడ్, తాజాగా హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి కూడా వైదొలగేందుకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది.

First Published:  28 Nov 2022 3:38 PM IST
Next Story