Telugu Global
International

అమెజాన్‌కు భారీ జరిమానా.. - ఉద్యోగులపై మితిమీరిన నిఘా పెట్టినందుకే..

వినియోగదారులు ఆర్డర్‌ చేసే ఉత్పత్తుల వివరాలను స్కానింగ్‌ యంత్రాలతో నమోదు చేస్తారు. అమెజాన్‌ సంస్థ ఉద్యోగులపై నిఘాకు కూడా ఆ యంత్రాలనే వినియోగించినట్టు ఏజెన్సీ వివరించింది.

అమెజాన్‌కు భారీ జరిమానా.. - ఉద్యోగులపై మితిమీరిన నిఘా పెట్టినందుకే..
X

ఉద్యోగుల పనితీరుపై మితిమీరిన నిఘా పెట్టిన ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌కి ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ సీఎన్‌ఐఎల్‌ భారీ జరిమానా విధించింది. అది ఏకంగా 32 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.280 కోట్లు) కావడం గమనార్హం. యూరోపియన్‌ యూనియన్‌ జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై వారి అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా అమెజాన్‌ డేటాను సేకరించినట్టు ఆ ఏజెన్సీ ఆరోపించింది. దీనిపై ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి జరిమానా విధించినట్టు తెలిపింది.

అమెజాన్‌ ఏర్పాటు చేసిన నిఘా యంత్రాల వల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సీఎన్‌ఐఎల్‌ తెలిపింది. వినియోగదారులు ఆర్డర్‌ చేసే ఉత్పత్తుల వివరాలను స్కానింగ్‌ యంత్రాలతో నమోదు చేస్తారు. అమెజాన్‌ సంస్థ ఉద్యోగులపై నిఘాకు కూడా ఆ యంత్రాలనే వినియోగించినట్టు ఏజెన్సీ వివరించింది. ఉద్యోగులు పది నిమిషాల కంటే ఎక్కువ సమయం పనిచేయకుంటే.. అవి యాజమాన్యానికి అలర్ట్‌ మెసేజ్‌ పంపుతాయని, వాటి ఆధారంగా ఉద్యోగి పనితీరును విశ్లేషిస్తున్నారని తెలిపింది. అంతేకాదు.. పని ప్రదేశంలో ఉద్యోగులు ఎంతసేపు ఉంటున్నారనే సమాచారం కూడా సేకరిస్తున్నట్టు వివరించింది. ఈ నిఘా ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని సీఎన్‌ఐఎల్‌ వెల్లడించింది.

మరోపక్క అమెజాన్‌ తన చర్యలను సమర్థించుకుంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసులను అందించేందుకు, ప్రొడక్టును డెలివరీ చేసే ముందు సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ఇలాంటి వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులపై నిఘా కోసం ఈ డేటా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. సీఎన్‌ఐఎల్‌ జరిమానాపై అప్పీల్‌ చేస్తామన్నారు. కాగా ఫ్రాన్స్‌లో అమెజాన్‌కు 8 అతిపెద్ద పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది పనిచేస్తుండటం గమనార్హం.

First Published:  24 Jan 2024 8:27 PM IST
Next Story