అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం.. డ్రోన్ దాడిలో మట్టుబెట్టిన అమెరికా
బిన్ లాడెన్ మృతి చెందిన తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన అల్-జవహరీని ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో చంపేసినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు.
అమెరికా మరోసారి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. 2011లో పాకిస్తాన్‌లో నక్కిన బిన్ లాడెన్‌ను నేవీ సీల్స్ హతమార్చిన తర్వాత.. అలాంటి ఆపరేషనే మరొకటి చేపట్టింది. అయితే ఈసారి ఒక్క సైనికుడు/ఏజెంట్ ఫీల్డ్‌లో దిగకుండానే.. కేవలం డ్రోన్లను ఉపయోగించి కీలక ఉగ్రవాదిని హతమార్చింది. బిన్ లాడెన్ మృతి చెందిన తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన అల్-జవహరీని ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో చంపేసినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా మీడియా కూడా అల్-జవహరీ హత్య గురించి కథనాలు వెలువరించాయి.
ఆఫ్గానిస్తాన్‌లో చేపట్టిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించనున్నట్లు వైట్ హైస్ వర్గాలు తెలిపాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఎన్నో ఏళ్లుగా అల్-జవహరీ గురించి గాలిస్తున్నాయి. ట్విన్ టవర్స్‌పై 11 సెప్టెంబర్ 2001లో జరిపిన దాడిలో జవహరీ కూడా కీలక సూత్రదారి. ఆ దాడిలో 3వేల మంది చనిపోవడంతో అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్టులో జవహరీని చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.
చాలా ఏళ్లుగా అండర్ గ్రౌండ్‌లో ఉంటూనే అల్ ఖైదాను నడిపించిన జవహరీ గురించి ఉప్పందుకున్న సీఐఏ.. ఎంతో చాకచర్యంగా డ్రోన్ సాయంతో దాడి చేసినట్లు తెలుస్తుంది. కాబూల్‌లోని షేర్పూర్ ప్రాంతంలో ఓ నివాసంపై 'వైమానిక దాడి' జరిగినట్లు తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిదిన్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ దాడి జరిగిందని తాలిబాన్ ఆరోపించింది. ఈ ట్వీట్ వల్లే అల్-జవహరీ హతమైన వార్తలకు మరింత బలం చేకూరుతోంది.