విమానం పైకెగరగానే ఇద్దరు పైలెట్లు తన్నుకున్నారు...ప్రయాణీకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నారు.
ఓ విమానం నడుపుతున్న ఇద్దరు పైలెట్లు గొడవకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్‌చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. వీళ్ళిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు.
భూమికి ఎన్నో మీటర్ల ఎత్తులో వెళ్తుండగా విమానం పైలెట్లు తన్నుకుంటే ప్రయాణీకుల పరిస్థితి ఏంటి ? భయంతో వణికి పోతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే కదా ! ఫ్రాన్స్ లో అదే జరిగింది.
ప్యారిస్ నుంచి జెనీవా వెళ్తున్న విమానం పైకి ఎగిరిన కొద్ది సేపటికే ఫ్లైట్ నడిపించే పైలెట్ , కో పైలెట్ల మధ్య గొడవ ప్రారంభమైంది. అది క్రమంగా పెరిగి పెద్దదయి విమానాన్ని గాలికి వదిలేసి ఒకరి కాలర్లు ఒకరు పట్టుకొని పిడిగుద్దులు గుద్దుకున్నారు. పెద్ద పెద్దగా అరుచుకున్నారు. వీరి కొట్లాట శబ్ధాలు ప్రయాణీకులకు కూడా వినిపించాయట.
చివరికి వీరి కొట్లాట పెద్దదవడంతో క్యాబిన్ సిబ్బంది వెళ్ళి వీళ్ళను విడదీశారట. దాంతో ఓ పైలెట్ క్యాబిన్ ను వదిలేసి ఫ్లైట్ డెక్ కు వెళ్ళిపోవడంతో విమానం ప్రశాంతంగా ముందుకు కదిలింది.
ఈ వ్యవహారం జూన్ లో జరిగింది కానీ తాజాగా వాళ్ళిద్దరినీ సస్పెండ్ చేయడంతో ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇంత కాలం యాజమాన్యం నిర్ణయం కోసం వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారట. . ఫ్రాన్స్ పౌర విమానయాన భద్రతా దర్యాప్తు సంస్థ నివేదిక బయటకు రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.