అత్యాచార యత్నం ఆరోపణలపై క్రికెటర్ అరెస్టు.. సస్పెండ్ చేసిన క్రికెట్ బోర్డు
శ్రీలంక జాతీయ ఆటగాడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. గుణతిలకను ఆస్ట్రేలియాలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలపై అరెస్టు చేయడంతో లంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
అత్యాచార యత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ లంక ఆల్ రౌండర్ దనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్ ల నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఐసిసి టి 20 ప్రపంచ కప్ 2022 సందర్భంగా ఒక మహిళపై లైంగిక వేధింపుల నేరారోపణలపై గత ఆదివారంనాడు గుణతిలక అరెస్టయిన విషయం తెలిసిందే. గుణతిలకను సోమవారం సిడ్నీలోని స్థానిక కోర్టులో వీడియో లింక్ ద్వారా విచారించిన న్యాయస్థానం బెయిల్ నిరాకరించిందని రాల్డ్ పత్రిక తెలిపింది.
" జాతీయ ఆటగాడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. గుణతిలకను ఆస్ట్రేలియాలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలపై అరెస్టు చేసినట్లు సమాచారం అందింది. ఆ తర్వాత అతనిని ఏ సెలక్షన్ కోసం పరిగణలోకి తీసుకోం. కేసు తేలే వరకు అతనిని ఎంపిక చేయకూడదని నిర్ణయించింది. " అని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. దోషిగా తేలితే అతనికి జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపింది. అతనిపై వచ్చిన నేరారోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపింది.
స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం, ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళతో గుణతిలక చాలా రోజులు టచ్‌లో ఉన్నారు. సిడ్నీ హోటల్ లో ఉండగా ఆమె పై అత్యాచార యత్నం చేసాడంటూ అతనిని అరెస్టు చేశారు.