ఆఫ్ఘనిస్తాన్‌లో 2,000 దాటిన భూకంప మృతుల సంఖ్య..
సుమారు 12 గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద కూరుకుపోయారని, తక్షణ సహాయం అందిస్తున్నామని ఆ దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రాయన్ తెలిపారు.
వరుస భూకంపాల ధాటికి ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలమైంది. శనివారం మధ్యాహ్నం సంభవించిన వరుస ప్రకంపనలతో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు ధ్వంసం కావడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయి. ఈ ప్రకంపన వల్ల మరణించిన సంఖ్య 2,000కు చేరిందని తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. మరో 5000 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. భూకంపం ధాటికి ఏకంగా డజనుకు పైగా గ్రామాలు నేలమట్టమయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో మొదటి సారి మధ్యాహ్నం 12.11 గంటలకు పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. ఆ తరువాత మధ్యాహ్నం 12.19 గంటలకు రెండవసారి 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇక మూడవసారి మధ్యాహ్నం 12.42 గంటలకు 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా వరుసగా మొత్తం 7సార్లు భూమి కంపించడంతో ఆ దేశం వణికిపోయింది. ముఖ్యంగా హెరాత్ పట్టణ పరిసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. హెరాత్‌లో శనివారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆ దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రాయన్ తెలిపారు. సుమారు 12 గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద కూరుకుపోయారని, తక్షణ సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ భూకంపం వల్ల 465 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 135 ఇళ్లు దెబ్బతిన్నాయని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం(UNOCHR) తెలిపింది. కూలిన భవనాల కింద కొందరు చిక్కుకుని ఉండొచ్చని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. గత రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. ఈ భూకంపం కారణంగా హెరాత్‌లో టెలిఫోన్ కనెక్షన్‌లు దెబ్బతిన్నాయి. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడానికి, ప్రాణాలతో బయటపడిన వారికి ఆహారం అందించడానికి వీలైనంత త్వరగా భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవాలని తాలిబాన్ ప్రభుత్వం స్థానిక సంస్థలను కోరింది.
♦