Telugu Global
International

బంగ్లాదేశ్ కు భరించలేని భారంగా మారనున్న అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం...ఆ దేశ‍ంలో నిరసనలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్‌లో మొదటి పర్యటన జరిగిన రెండు నెలల తర్వాత ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా అదానీకి చెందిన జార్ఖండ్ లోని గొడ్డ పవర్ ప్లాంట్ నుంచి బంగ్లా దేశ్ కు విద్యుత్తు సప్లై జరుగుతుంది. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తు మొత్తాన్ని బంగ్లాదేశ్ 25 సంవత్సరాలపాటు కొనుగోలు చేయాల్సిందే.

బంగ్లాదేశ్ కు భరించలేని భారంగా మారనున్న అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం...ఆ దేశ‍ంలో నిరసనలు
X

అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్తు కొనడానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB) చేసుకున్న ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు వస్తున్నాయి. అదానీపై హిండెన్ బర్గ్ నివేదికల తర్వాత ఆ ఒప్పందంపై మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. బాంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలు,ప్రముఖ ఆర్థిక వేత్తలు ఈ ఒప్పందంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్‌లో మొదటి పర్యటన జరిగిన రెండు నెలల తర్వాత ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా అదానీకి చెందిన జార్ఖండ్ లోని గొడ్డ పవర్ ప్లాంట్ నుంచి బంగ్లా దేశ్ కు విద్యుత్తు సప్లై జరుగుతుంది. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన విద్యుత్తు మొత్తాన్ని బంగ్లాదేశ్ 25 సంవత్సరాలపాటు కొనుగోలు చేయాల్సిందే.

ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ అదానీ నుండి ఎటువంటి విద్యుత్ తీసుకోకపోయినా, 25 సంవత్సరాల పాటు ఏటా 450 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, ది డిప్లొమాట్, ఇటీవలి నివేదికలో పేర్కొంది. బంగ్లాదేశ్ అదానీ నుండి విద్యుత్తును ఉపయోగించాలనుకుంటే, బొగ్గు కోసం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆ విధంగా అదానీ పవర్ ప్లాంట్ ఉపయోగించే ప్రతి టన్ను బొగ్గుకు బంగ్లాదేశ్‌కు దాదాపు $400 ఖర్చవుతుంది. ఇది సాధారణ బొగ్గు ధర కంటే 60 శాతం ఎక్కువ.

అదానీతో బంగ్లాదేశ్ చేసుకున్న ఒప్పందంలో ఎలాంటి హేతుబద్దత లేదని బంగ్లాదేశ్ కు చెందిన డైలీ స్టార్ పత్రిక తన‌ నివేదికలో పేర్కొంది. ఈ ఒప్పందం బంగ్లాదేశ్ కు భరించలేని భారమవుతుందని న్యాయ, ఇంధన నిపుణులు అంటున్నారు.

“ ఈ ఒప్పందం బంగ్లాదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చాలా పక్షపాతంగా ఉంది. తెలివిగల ఎవరైనా ఈ ఒప్పందంపై సంతకం చేయరు ”అని ఇంధన ఆర్థికవేత్త, సిడ్నీకి చెందిన క్లైమేట్ ఎనర్జీ ఫైనాన్స్ ఆస్ట్రలేషియా వ్యవస్థాపకుడు టిమ్ బక్లీ అన్నారు.

ఈ ఒప్పందం నుండి బైటప‌డేందుకు బంగ్లాదేశ్ కు ఎలాంటి అవకాశం లేదని డైలీ స్టార్ రిపోర్ట్ తెలిపింది.

"అటువంటి ఒప్పందంపై సంతకం చేయడం శిక్షార్హమైన నేరం ఈ ఒప్పందంలో అవినీతి ఉందని మేము నమ్ముతున్నాము" అని బంగ్లాదేశ్ వినియోగదారుల సంఘం అధికారులను ఉటంకిస్తూ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ చెప్పారు. ''ఈ విద్యుత్ ఒప్పందం అనవసరమైనది. ఈ ప్రాజెక్టు వల్ల బంగ్లాదేశ్ కు ఎలాంటి ప్రయోజనం లేదు.'' అని ఆయన అన్నారు.

ఈ ఒప్పందంపై బాంగ్లా దేశ్ లో తీవ్ర నిరసనలు విమర్శలు వస్తుండటంతో ఈ ఒప్పందంలో సవరణలను ప్రతిపాదిస్తూ బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB)అదానీ పవర్ కు లేఖ రాసింది. ఆ లేఖపై అదానీ పవర్ ఇప్పటి వరకు స్పందించలేదు.

First Published:  1 March 2023 8:39 AM IST
Next Story