Telugu Global
International

అబార్షన్ అక్కడ నేరం.. 24 దేశాల్లో నిషేధం..

ఆర్థిక ఇబ్బందుల కారణంగా అబార్షన్‌కి ప్రత్యేక అనుమతి ఇచ్చే దేశాల సంఖ్య 13. పుట్టబోయే పిల్లల్ని తల్లిదండ్రులు పోషించలేరు అనుకుంటేనేవారికి అబార్షన్ అనుమతిస్తారు.

అబార్షన్ అక్కడ నేరం.. 24 దేశాల్లో నిషేధం..
X

భారత్‌లో అబార్షన్ విషయంలో మహిళలదే తుది నిర్ణయం అంటూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వివాహితులైనా, అవివాహితులైనా అబార్షన్ విషయంలో మహిళల హక్కులను కాలరాయలేమని చెప్పింది సుప్రీం. కానీ ప్రపంచంలో ఇంకా 24 దేశాలు అబార్షన్ పై నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే అమెరికా కూడా అందులో ఒకటి కావడం విశేషం. తమ దేశంలో అబార్షన్ మహిళల హక్కు కాదని అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. మరికొన్ని దేశాల్లో కూడా అబార్షన్ పై నిషేధం ఉంది. ఎల్ సాల్వడార్ దేశంలో అబార్షన్ చేయించుకుంటే ఆ మహిళకు జైలు శిక్ష విధిస్తారు.

75 దేశాల్లో ఆంక్షలు లేకుండా అనుమతి..

ఆడవారి కష్టనష్టాలు అర్థంచేసుకుని, అబార్షన్‌కి అనుమతి కోరిన వెంటనే మంజూరు చేసే దేశాలు ప్రపంచవ్యాప్తంగా 75 ఉన్నాయి. కారణాలు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆ 75 దేశాల్లో అబార్షన్ చేయించుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అబార్షన్‌కి ప్రత్యేక అనుమతి ఇచ్చే దేశాల సంఖ్య 13. పుట్టబోయే పిల్లల్ని తల్లిదండ్రులు పోషించలేరు అనుకుంటేనే వారికి అబార్షన్ అనుమతిస్తారు. మరో 50 దేశాల్లో అనారోగ్య కారణాలతో అబార్షన్ చేయించుకోవచ్చు.

45 శాతం ప్రమాదకరం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 7.3 కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వీటిలో 45 శాతం అబార్షన్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. అబార్షన్ తర్వాత సమస్యలు తలెత్తితే చికిత్స తీసుకునేవారి సంఖ్య కేవలం 70 లక్షలు మాత్రమే. అంటే మిగతావారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. సామాజిక కట్టుబాట్ల మధ్య గర్భస్రావం జరిగిందనే విషయాన్ని కూడా చాలామంది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఆర్థిక పరిస్థితి కారణంగా గర్భస్రావం తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తినా కొంతమంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత్‌లో ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రాబోతోంది. అబార్షన్ అనేది తప్పు అనే భావన క్రమంగా తగ్గే అవకాశాలున్నాయి.

First Published:  30 Sept 2022 3:45 AM GMT
Next Story