మృతదేహాల అవయవాలను ఆన్‌లైన్‌లో అమ్మేసింది..! - అమెరికాలోని మార్చురీ ఉద్యోగిని దారుణం
2021 అక్టోబర్ నుంచే పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్న స్కాట్.. తన విధుల్లో భాగంగా స్థానిక మెడికల్ స్కూల్ నుంచి అవయవాలను సేకరించి.. వాటిని అతడికి ఆన్‌లైన్‌లో అమ్మేసేది.
ఆమె పేరు కెన్‌డేస్ చాంప్‌మన్ స్కాట్.. అమెరికాలోని ఓ మార్చురీలో ఉద్యోగం.. మృతదేహాల రవాణా, వాటిని పూడ్చిపెట్టడం, అవసరమైతే వాటికి కొన్ని ఔషదాలు పూసి భద్రపరచడం ఆమె పని. ఈ పనిలో లొసుగులు గుర్తించిన స్కాట్ మృతదేహాల అవయవాలను విక్రయించేందుకు తెగించింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి మృతుల గుండె, మెదడు, జననేంద్రియాలు, కళ్లు ఇలా వివిధ అవయవాలను ఆన్‌లైన్‌లో అమ్మేసింది.
2021 అక్టోబర్ నుంచే పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్న స్కాట్.. తన విధుల్లో భాగంగా స్థానిక మెడికల్ స్కూల్ నుంచి అవయవాలను సేకరించి.. వాటిని అతడికి ఆన్‌లైన్‌లో అమ్మేసేది. ఇలా దాదాపు 11 వేల డాలర్లు అతని నుంచి వసూలు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏప్రిల్ 5న కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్కాట్ దారుణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అవయవాలు కొనుగోలు చేసిన వ్యక్తి పెన్సిల్వేనియాకు చెందిన జెరెమీ లీ పావ్లాగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇతనితో స్కాట్ దాదాపు 9 నెలలుగా ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు వెల్లడించారు. అవయవాలను కొనుగోలు చేసిన లీ పావ్లా మాత్రం వాటిని ఎందుకు కొనుగోలు చేశాడనేది ఇంకా తేలలేదు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.