Telugu Global
International

2022 బ్రీఫ్ రౌండప్!

ఈ ఏడాది జరిగిన ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలానే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో జూన్‌ 21న వచ్చిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు.

2022 బ్రీఫ్ రౌండప్!
X

2022 సంవ‌త్స‌రం కొన్ని తీపి గుర్తులతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా మిగిల్చింది. ప్రపంచాన్ని కుదిపేసిన ఉక్రెయిన్ యుద్ధం, ఒక అమ్మాయి మరణంతో ఉద్యమానికి దిగిన ఇరాన్ దేశం, ఎనిమిది బిలియన్ల జనాభా మైల్‌స్టోన్, బ్రిటన్ రాణి మరణం.. ఇలా ఈ ఏడాదిని బ్రీఫ్‌గా గుర్తుచేసుకుంటే..


ఈ ఏడాది వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముందున్నాడు. రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని ఈ ఏడాది హీరోగా మారాడు. టైమ్‌ మ్యాగజైన్‌ 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా నిలిచాడు. ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచిన మరో వ్యక్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. ఒకప్పుడు భారత దేశాన్ని పాలించిన బ్రిటన్‌కు భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికవ్వ‌డం ఈ ఏడాది హాట్ టాపిక్‌గా మారింది. ఇక వీళ్లతోపాటు రోజూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ కూడా ఈ ఏడాది ట్విట్టర్‌‌ను కొనుగోలు చేసి ఎన్నో కాంట్రవర్సీలకు తెర లేపాడు.


ఇక ఈ ఏడాది జరిగిన విషాదాల్లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ మరణం ఒకటి. అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 8న కన్నుమూసిన ఎలిజబెత్.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ సింహాసనాన్ని ఏలింది. ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసినట్టయింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మిఖాయిల్ గోర్బచెవ్ కూడా ఈ ఏడాదే మరణించారు. ఈయన సోవియెట్‌ యూనియన్‌ చిట్టచివరి అధ్యక్షుడు. సోవియెట్‌ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, సోవియెట్‌ యూనియన్‌లో ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. వీరితో పాటు ఈ ఏడాది జపాన్‌ మాజీ ప్రధాని షింజో.. ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఇవన్నీ ఈ ఏడాది మిగిల్చిన విషాదాలుగా చెప్పుకోవచ్చు.


ఈ ఏడాది జరిగిన ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలానే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో జూన్‌ 21న వచ్చిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు. జూన్‌లో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. కొద్ది నెలల పాటు జనం నానా అవస్థ‌లు పడ్డారు. అక్టోబర్‌ నాటికి పాకిస్తాన్‌లో వరద నష్టం 14.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది వేసవికాలంలో వడగాలులతో పశ్చిమ దేశాలు అల్లాడిపోయాయి. తాజాగా మంచు తుపానుతో అమెరికా గడ్డకట్టుకుపోతోంది.

ఇవి కూడా..

ఈ ఏడాది దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక ముందుంది. రెండు కోట్ల జనాభా ఉండే ఈ దేశంలో ఎకానమీ పూర్తిగా పడిపోవడంతో ప్రజలు ఏమీ కొనలేని స్థితికి వచ్చేశారు. పెట్రోల్, ఆహార ధాన్యాలు కూడా పంపిణీ చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. శ్రీలంక అధ్యక్షుడు దేశం విడిచివెళ్లిపోయాడు. అలాగే బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది. వరుసగా ప్రధానులు మారాల్సి వచ్చింది. యుద్ధం కారణంగా కొన్ని యూరప్ దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.




ఈ ఏడాది హిజాబ్‌ వివాదంలో ఇరాన్ అట్టుడుకిపోయింది. హిజాబ్ ధరించని నేరానికి మహసా అమిన్‌ అనే 22 ఏళ్ల యువతిని ఇరాన్‌లోని మోరల్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆమె లాకప్‌లో మరణించడంతో ఇరాన్‌లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఇరాన్‌లో యువతీ యువకులు ఏకమై రోడ్లపై హిజాబ్‌లను తగులబెట్టిన దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. నిరసనల ధాటికి ప్రభుత్వం దిగి వచ్చి మోరల్‌ పోలీసు వ్యవస్థని రద్దు చేసింది. ఈ ఏడాది ఇరాన్ ప్రజలు ప్రభుత్వంపై పోరాడి అతి పెద్ద విజయాన్ని సాధించారు.



చైనాలో ఈ ఏడాది మరోసారి కోవిడ్ విజృంభించింది. జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రజలు వ్యతిరేకించడంతో ఆంక్షలను సడలించారు. దీంతో లక్షల సంఖ్యలో చైనాలో కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి.

ఈ ఏడాది ప్రపంచ జనాభా మరో మైల్‌స్టోన్ దాటింది. మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. ఫిలిప్పైన్స్‌లో నవంబర్‌ 15న జన్మించిన ఒక చిన్నారితో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

First Published:  29 Dec 2022 6:08 PM IST
Next Story