Telugu Global
International

యెమెన్‌లో పెను విషాదం.. తొక్కిస‌లాట‌లో 85 మంది మృతి

కొంత‌మంది వ్యాపారులు రంజాన్ మాసం నేప‌థ్యంలో పేద‌ల‌కు సాయంగా డ‌బ్బు పంపిణీ చేసేందుకు ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు తెలిసింది. ఈ సాయం అందుకోవ‌డానికి వంద‌లాదిమంది గుమికూడారు.

యెమెన్‌లో పెను విషాదం.. తొక్కిస‌లాట‌లో 85 మంది మృతి
X

అరేబియా ద్వీప‌క‌ల్పంలోని అత్యంత పేద దేశ‌మైన యెమెన్‌లో గురువారం జ‌రిగిన ఓ చారిటీ సంస్థ నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో పెను విషాదం చోటుచేసుకుంది. పేద‌ల‌కు అందించేందుకు ఓ పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 85 మంది మృతిచెంద‌గా, వంద‌లాది మందికి గాయాల‌య్యాయి. ఇది ద‌శాబ్దంలో జ‌రిగిన ఘోర‌మైన తొక్కిస‌లాట‌ల్లో ఒక‌ట‌ని హుతీ అధికారులు వెల్ల‌డించారు. మృతుల్లో మ‌హిళ‌లు, పిల్ల‌లే ఎక్కువ‌మంది ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కొంత‌మంది వ్యాపారులు రంజాన్ మాసం నేప‌థ్యంలో పేద‌ల‌కు సాయంగా డ‌బ్బు పంపిణీ చేసేందుకు ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు తెలిసింది. ఈ సాయం అందుకోవ‌డానికి వంద‌లాదిమంది గుమికూడారు. ఒక‌రిపై ఒక‌రు ఎక్కి ముందుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో తొక్కిస‌లాట చోటుచేసుకొని ఈ దారుణం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న అనంత‌రం మృత‌దేహాల‌ను, గాయ‌ప‌డిన‌వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఈ పంపిణీ చేప‌ట్టి.. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన ముగ్గురు నిర్వాహ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు హుతీ అంత‌ర్గ‌త మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టు హుతీ రాజకీయ చీఫ్ మహదీ అల్-మషత్ తెలిపారు.

విస్తృత పేదరికం

యెమెన్‌లో ఎనిమిదేళ్లకు పైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. 2014లో ఇరాన్-మద్ద‌తు గల హుతీ తిరుగుబాటుదారులు సనాను స్వాధీనం చేసుకోవడంతో వివాదం ప్రారంభమైంది, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తరువాతి సంవత్సరం జోక్యం చేసుకోవలసి వచ్చింది. అక్క‌డి జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. హుతీ-నియంత్రిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సంవత్సరాలుగా వేతనాలు చెల్లించడం లేదు.

First Published:  20 April 2023 9:33 AM IST
Next Story